ప్రయోగాల బాటలో విజయాల వేట
మెగా కుటుంబం నుంచి వచ్చినా… తొలి నుంచీ మూస ధోరణికి దూరంగా, విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేసిన హీరో వరుణ్ తేజ్.
ముకుందతో మొదలైన ప్రయాణానికి కంచె కీలక మలుపు. నటుడిగా అతని సామర్థ్యాన్ని చాటిన ఈ చిత్రం ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. అయితే ఆ తర్వాత వచ్చిన లోఫర్, మిస్టర్ పరాజయాలు కెరీర్‌ను కొంత వెనక్కి నెట్టాయి.
అయితే ఆ తర్వాత ఫిదాతో వరుణ్ తేజ్ కెరీర్ మళ్ళీ గాడిన పడింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవితో కలిసి చేసిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత తొలి ప్రేమ కూడా మంచి విజయాన్ని అందుకుంది. అయితే అంతరిక్షం 9000 KMPH మాత్రం విభిన్న ప్రయత్నంగా నిలిచినా, కమర్షియల్‌గా ఆశించిన ఫలితం అందుకోలేలపోయింది.
2019లో F2తో భారీ విజయాన్ని అందుకున్న వరుణ్… అదే ఏడాది గద్దలకొండ గణేష్ తో తనలోని మాస్ యాంగిల్‌ను ఆవిష్కరించుకున్నాడు. అయితే ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. ‘గని’ ఘోరంగా నిరాశపరిచింది, F2 అంత కాకపోయినా… F3 మరోసారి మంచి కమర్షియల్ సక్సెస్ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా వరుస పరాజయాలు వరుణ్ కెరీర్‌ను దెబ్బ తీశాయి.
ఇలాంటి సమయంలో వచ్చిన కొరియన్ కనకరాజుతో వరుణ్ తేజ్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వచ్చిన ఈ హారర్-కామెడీ అతని ఇమేజ్‌కు భిన్నమైన ఎంటర్టైనర్గా నిలిచి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
వరుణ్ తేజ్ కెరీర్‌ను గమనిస్తే… విజయాల కంటే ప్రయోగాలే ఎక్కువ. కానీ అదే అతని ప్రత్యేకత.
సైనికుడిగా కంచెలో కనిపించిన అతను… ఫిదాలో పక్కింటి అబ్బాయిలా మెప్పించాడు. F2లో కామెడీ పండించాడు. గద్దలకొండ గణేష్‌లో మాస్ హీరోగా ఆకట్టుకున్నాడు. గనిలో బాక్సర్‌గా, ఆపరేషన్ వాలెంటైన్లో ఎయిర్‌ఫోర్స్ అధికారిగా, మట్కాలో పీరియడ్ క్యారెక్టర్లో కనిపించాడు. ఇప్పుడు కొరియన్ కనకరాజులో కామెడీ టచ్ ఉన్న పాత్రతో మరోసారి తనను తాను కొత్తగా చూపించాడు.
అతని బలం… కొత్తదనం కోసం వెతకడం.
అతని బలహీనత… కథల ఎంపికలో తరచుగా తడబడటం.
అయినా… ఒకే ఇమేజ్‌కు పరిమితం కాకుండా ప్రతి సినిమాతో తనను తాను కొత్తగా చూపించుకోవాలనే తపన మాత్రం అభినందనీయం.
ప్రతి మలుపులో ఓ ప్రయోగం…
ప్రతి విజయంతో ఓ కొత్త గుర్తింపు…
ప్రతి పరాజయం తర్వాత మరో సిన్సియర్ ప్రయత్నం… వరుణ్ తేజ్ కి ఈ తరం హీరోల్లో ఒక ప్రత్యేకత ఆపాదిస్తున్నాయి. ప్రస్తుతం వరుణ్… తన సోదరి నీహారిక నిర్మాతగా “బరి” సినిమా చేస్తున్నాడు!!
- ధీరజ్ అప్పాజీ

