తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ పోరం ‘మరియు భారత్ కల్చరల్ అకాడమీ సంయుక్తంగా, ప్రతి సంవత్సరం కళా ప్రపూర్ణ కత్తి కాంతారావు జన్మదినోత్సవాన్ని పునస్కరించుకుని గత 24 సంవత్సరాలుగా పలువురు సినీ ప్రముఖులను సన్మానిస్తూ కత్తి కాంతారావు పేరున జాతీయ పురస్కారాలను అందిస్తున్నది. కాగా 2026 జాతీయ పురస్కారానికి గాను ఎంపికయ్యారు నటుడు హీరో సుమన్. దాదాపు 300కు పైగా తెలుగు… తమిళ, మళయాళ, కన్నడ చిత్రాలలో నటించి, పౌరాణిక పాత్రలైన శ్రీవేంకటేశ్వర స్వామిగా.. శ్రీ రాముడిగా… శ్రీకృష్ణుడిగా, యంగ్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ గా, యాక్షన్ చిత్రాల హీరోగా ప్రేక్షకుల హృదయాలలో గొప్ప స్థానం సంపాదించుకున్నారు సుమన్. అవార్డు కమిటికి చైర్మన్ గా K.V.రమణాచారి..(IAS). సి.పార్థసారథి.

IAS (Rtd) నాగబాల డి. సురేష్ కుమార్ కో చైర్మన్స్ గా వ్యవహరించారు. తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, శ్రీమతి గిడుగు కాంతికృష్ణ తదితర ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సుమన్ మాట్లాడుతూ… “కాంతారావుగారితో నేను కలిసి చేసిన సినిమాలు తక్కువైనా ఆయనతో ముచ్చటించినపుడు- ‘బాబు సుమన్! నీకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకో! నటుడిగా మంచి పేరు సాధించు కాని, సినిమా మాత్రం తీయకు, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. నా లైఫ్ లో సినిమా తీసి చాల నష్టపోయాను. సాఫీగా సాగుతున్న నా నటజీవితంలో నిర్మాతగా మారి చేయని తప్పు చేశాను’ అని చెప్పారు. ఆయన మాట ప్రకారం నేను ఇప్పటివరకు నిర్మాణ శాఖలోకి వెళ్ళలేదు. నేను చిత్ర పరిశ్రమకు వచ్చి 48 ఏళ్లవుతోంది. దాదాపు వెయ్యి చిత్రాల్లో నటించాను. తెలుగులో వంద సినిమాల్లో హీరోగా నటించాను. తమిళం, కన్నడలోనూ హీరోగా నన్ను ఆదరించారు” అని అన్నారు!!

