హారర్, యాక్షన్, థ్రిల్లర్, కామెడీ, రొమాన్స్ అంశాల సమ్మేళనంగా తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం జూన్ 12న తెలుగు, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎంఎస్కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మాణంలో, క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ మేగోటి సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్ సినిమా ప్రమోషన్స్‌కు సహకరించకపోవడం వల్ల తమ చిత్రానికి భారీ నష్టం వాటిల్లిందని ఆరోపించారు. “ఇది నేను దర్శకత్వం వహించిన 11వ చిత్రం. నా కథను నమ్మి సినిమా నిర్మించిన నిర్మాతలకు కృతజ్ఞతలు. 52 మంది సీనియర్ కళాకారులతో కేవలం 45 రోజుల్లో చిత్రాన్ని పూర్తి చేశాం. ‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే వినూత్న కాన్సెప్ట్ చుట్టూ కథ తిరుగుతుంది. హారర్ థ్రిల్లర్ అంశాలతో పాటు యాక్షన్, ఎమోషన్లను సమపాళ్లలో మేళవించాం. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన వరలక్ష్మి శరత్‌కుమార్‌కు కెరీర్లో గుర్తుండిపోయే పాత్ర లభించింది. ఆమె సౌకర్యం కోసం మేము అన్ని విధాలా సహకరించాం. కానీ డబ్బింగ్‌కు కూడా సరిగా అందుబాటులో లేకపోవడం మాకు ఇబ్బందులు కలిగించింది. అగ్రిమెంట్ ప్రకారం ప్రమోషన్స్‌లో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ స్పందించలేదు. కేవలం గంటసేపు ప్రమోషన్ కార్యక్రమానికి రావాలని కోరినా రాలేదు. డబ్బులు తీసుకున్న తర్వాత ఇలా వ్యవహరించడం బాధాకరం. దీని వల్ల మా చిత్రానికి భారీ నష్టం జరిగింది. మా సినిమా కాన్సెప్ట్ ‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ మాదిరిగానే కర్మ ఎవరినీ వదిలిపెట్టదు” అని అన్నారు.

