ఇరుముడి” సాధిస్తున్న అసాధారణ విజయం తెలుగునాట తలలు పండిన సినీ పరిశీలకులకు సైతం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఏ విధమైన అంచనాలూ లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించే దిశగా దూసుకుపోతోంది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలైన “మన శంకర్ వరప్రసాద్ గారు, పెద్ది” చిత్రాలను సైతం త్రోసి రాజనేలా ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ రెండు చిత్రాల కథానాయకులు తండ్రీతనయులైన చిరంజీవి – రామ్ చరణ్… ఇద్దరూ “ఇరుముడి” చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించి, ఈ చిత్రాన్ని భుజానికి ఎత్తుకోవడం మరింత కలిసి రానుంది.
ముఖ్యంగా పరిమిత బడ్జెట్లో రూపొంది ఉండడం “ఇరుముడి” చిత్రానికి అతి పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది. తండ్రీకూతుళ్ళ సెంటిమెంటుకు ప్రేక్షకులు… మరీ ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు భయంకరంగా కనెక్ట్ అవ్వడానికి తోడు… అయ్యప్ప భక్తులంతా ఈ చిత్రం చూసేందుకు థియేటర్లకు పోటెత్తుతుండడం అగ్నికి ఆజ్యం పోసినట్టయిందని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. “మల్లెపూల పల్లకి” పాటకు థియేటర్లలో ప్రేక్షకులు పూనకాలెత్తిపోతున్నారని చెబుతున్నారు. సందేహం లేదు. ఈ చిత్రం తెలుగు చలనచిత్ర చరిత్రలో మరో సువర్ణాధ్యాయం లిఖించే దిశగా ముందుకు సాగుతోంది. ఈ చిత్రంతో “మైత్రి మూవీ మేకర్స్” మరింత బలపడునుంది. ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకున్న టి సిరిస్ కూడా జాక్ పాట్ కొట్టింది. ఇంకా చెప్పాలంటే… ఈ సంస్థకు తెలుగులో నక్కతోక తొక్కినట్లయింది.
-ధీరజ అప్పాజీ

