నాకు ఇష్టమైన వ్యాపకాల్లో “యాంకరింగ్” కూడా ఒకటి. అందుకే అవకాశం రావడం ఆలశ్యం ఎగిరి గంతేసి (“రేసుగుర్రం”లో శృతిహాసన్ లా) “మైక్” అందిపుచ్చుకుంటాను. అయితే నిన్న ప్రముఖ దర్శకనిర్మాత శ్రీ అల్లాణి శ్రీధర్ గారితో మా “తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్” ఏర్పాటు చేసిన “మీట్ ది ప్రెస్” కార్యక్రమానికి “వ్యాఖ్యాత”గా వ్యవహరించడం నాకు ఇంకొంచెం ఎక్కువ సంతృప్తినిచ్చింది!!
ప్రముఖ దర్శకనిర్మాత అల్లాణి శ్రీధర్ గారితో నాది సుమారు రెండున్నర దశాబ్దాల పరిచయం. స్వభావరీత్యా “స్నేహశీలి” కావడానికితోడు… పత్రికారంగంతో అనుబంధం కలిగిన వ్యక్తి కావడంతో మీడియాతో ఆయన ఎప్పుడూ మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. నేను గమనించినంతవరకు ఆయనది “మిస్టర్ కూల్” అనదగ్గ వ్యక్తిత్వం. “సింప్లిసిటీ” ఆయన సిద్ధాంతం!!
“మీట్ ది ప్రెస్”లో ఫిల్మ్ క్రిటిక్స్ మిత్రులు ప్రశ్నలు సంధించడానికి ముందు… ఆయన తన కెరీర్ ని “సింహావలోకనం” చేసుకున్నారు. ఆ తర్వాత తన భవిష్యత్ కార్యాచరణను పంచుకున్నారు. టెక్నాలజీపరంగా ఆయన సాధించిన “పట్టు” గురించి విన్న తర్వాత ఆయనకు “ఫ్యాన్” అవ్వకుండా ఉండలేకపోయాను. దర్శకత్వశాఖలో రాణించాలనుకునేవాళ్లకు, సక్సెస్ ఫుల్ గా కొనసాగాలనుకునేవాళ్లకు… ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన “ఎ ఐ టెక్నాలజీ” ఎంత అద్భుతంగా ఉపయోగపడగలదో ఆయన సోదాహరణంగా వివరించిన తీరుకు నేను ‘ఫిదా” అయిపోయాను. “తుది శ్వాస విడిచేవరకు సినిమాలు తీస్తూనే ఉండాలన్నది తన కోరిక” అని ప్రకటించినప్పుడు అందరం చాలా “ఎమోషనల్” అయిపోయాం!!
యధాతధంగా ఆయన “కోరిక”గురించి
ఆయన మాటల్లోనే చెప్పాలంటే………
“నేను యాక్షన్ చెప్పాక… ఆర్టిస్టులు నటిస్తూ ఉంటారు. సీన్ అయిపోతుంది. నేను “కట్” చెబుతానని… మా కెమెరామెన్ వెయిట్ చేస్తుంటాడు. కానీ నేను చెప్పను. “డైరెక్టర్ గారు ఎందుకు కట్ చెప్పడం లేదని” అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. నేను “కట్” చెప్పకపోవడానికి కారణం… నేను భౌతికంగా దూరం కావడమని కాసేపటికి తెలుస్తుంది. పని చేస్తూ… చేస్తూ “కళామతల్లి” ఒడిలోనే ఒరిగిపోవాలన్నది నా బలీయమైన కోరిక” అని చెప్పారు శ్రీధర్ గారు. ఆ మాటలు వింటున్నప్పుడు… నావరకు నేను భావోద్వేగానికి లోను కాకుండా ఉండలేకపోయాను. నా కళ్ళు చెమర్చకుండా ఉండలేకపోయాయి!!
ఈటీవీ కోసం తాను ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చేస్తున్నానని, అది కాకుండా మరికొన్ని ప్రి-ప్రొడక్షన్ దశలో ఉన్నాయని శ్రీధర్ గారు చెప్పారు. పిల్లల కోసం సినిమాలు లేకపోవడం, ప్రభుత్వాలు ఆ దిశగా చొరవ తీసుకోవకపోవడం పట్ల ఆయన ఈసందర్భంగా విచారం వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రభుత్వ పెద్దల్లో కదలిక తెచ్చేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. శ్రీధర్ గారు దర్శకనిర్మాతగానే కాకుండా… ఫిల్మ్ ఫెస్టివల్స్, నంది అవార్డ్స్, గద్దర్ అవార్డ్స్ వంటి కమిటీల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తుంటారు!!
“ఉదయం” వారపత్రికకు “ఎడిటర్” బాధ్యతలు నిర్వహించిన శ్రీధర్ గారు “కొమురం భీమ్”తో దర్శకుడిగా అరంగేట్రం చేసి, “రగులుతున్న భారతం, ప్రేమే నా ప్రాణం, ఉత్సాహం, తూహీ మేరీ గంగా, తథాగత బుద్ధ, తులసీదాస్, హనుమాన్ చాలీసా, చిలుకూరు బాలాజీ” చిత్రాలు తెరకెక్కించారు. వీటిలో పలు చిత్రాలకు వీరు నిర్మాత కూడా కావడం గమనార్హం!!
కొసమెరుపు:
కార్యక్రమం జయప్రదంగా ముగిసింది. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీధర్ గారు మా నుంచి సెలవు తీసుకునేందుకు సమాయత్తమవుతున్న సమయంలో… నేను కూడా ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన పట్ల కొత్తగా నాలో మొలకెత్తిన “అభిమానాన్ని” ప్రకటించుకున్నాను!!
“మీరు నాకు ఫ్యాన్ అయ్యానని అంటున్నారు కాబట్టి… నాపై నేను వేసుకునే జోక్ ఒకటి మీతో షేర్ చేసుకుంటాను” అని అన్నారు శ్రీధర్ గారు. ఆయనతో జరిపిన “ముఖాముఖి” ద్వారా అప్పటికే నాకు…. శ్రీధర్ గారి “హాస్యప్రియత్వం” పరిచయమై ఉండడం, నేను స్వతహాగా “స్వయం ప్రకటిత హాస్య ప్రియుడ్ని” కావడంతో.. నేను నా రెండు చెవులూ రిక్కించి… ఆసక్తిగా ముందుకి వంగాను!!
“నేను దాసరి నారాయణరావు గారి శిష్యుడ్ని. మా గురువు గారు “దర్శకరత్న” అయితే…. నేను “దర్శక ప్రయత్న” అని నాకు అనిపిస్తుంటుంది” అన్నారు. నేను బిగ్గరగా నవ్వకుండా ఉండలేకపోయాను!!
కానీ అంతలోనే నాకు
“జ్ఞానోదయం” కూడా కలిగింది!!
తొమ్మిది సినిమాలు… (తెలుగులోనే కాకుండా హిందీలోనూ) చేసి, తొలిచిత్రం “కొమురం భీమ్”తోనే చరిత్రకెక్కి, అక్కినేని నాగేశ్వరరావు వంటి కారణజన్ముడ్ని డైరెక్ట్ చేసి, ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించి / నిర్వహిస్తున్న “అల్లాణి శ్రీధర్” లాంటివారే… తననొక “దర్శక ప్రయత్న”గా అభివర్ణించుకుంటున్నారంటే… నాలాంటివాళ్ళు “ఒళ్ళు ఇంకెంత దగ్గరగా” ఉంచుకోవాలి??
హ్యాపీ బర్త్ డే శ్రీధర్ గారు!!
