(ధీరజ అప్పాజీ)
సహజమైన నటనకు చిరునామాగా నిలిచిన కథానాయిక. గ్లామర్ కంటే అభినయానికి ప్రాధాన్యతనిచ్చే నటి. పాత్ర ఏదైనా అందులో ఒదిగిపోయే ప్రయత్నం చేసే ప్రతిభాశాలి.
కానీ ఇప్పుడు ఆమె చుట్టూ ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామాయణం’ చిత్రంలో సీతగా నటించిన సాయి పల్లవి ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
నిజంగా ఆమె నటనలో లోపముందా? లేక సీత పాత్రపై ప్రేక్షకుల్లో ఉన్న అపారమైన అంచనాలే ఈ విమర్శలకు కారణమవుతున్నాయా? అని పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె కేవలం కమర్షియల్ హీరోయిన్గా ఎదగాలని ప్రయత్నించలేదు. కథలో తన పాత్రకు ప్రాధాన్యత ఉండాలని బలంగా కోరుకునే హీరోయిన్. పారితోషికాని కంటే పాత్రకే ప్రాధాన్యత ఇచ్చే విలక్షణ వ్యక్తిత్వం ఆమె సొంతం.
అయితే మరి సీత పాత్రతో సమస్య ఏమిటి? సీత అంటే పక్కింటి అమ్మాయి కాదు. ప్రతి భారతీయుడి గుండెల్లో ఒక ప్రత్యేకమైన స్థానం కలిగిన కారణజన్మురాలు.
అలాంటి పాత్రను తెరపై ఆవిష్కరించడం ఏ నటికైనా పెద్ద సవాలే. ఇప్పటికే ప్రేక్షకుల మనసుల్లో సీతకు సంబంధించి కొన్ని దృశ్యరూపాలు, కొన్ని అభిప్రాయాలు బలంగా ఉన్నాయి. వాటికి అనుగుణంగా సరికొత్త సీత పరిచయం చేయడం అంత తేలికైన విషయం కాదు.
సాయి పల్లవి నటన బాగున్నప్పటికీ, సీత పాత్రకు ఉండాల్సిన ఔన్నత్యం పూర్తిగా ఆవిష్కృతం కాలేదని ఎక్కువశాతం మంది అభిప్రాయపడుతున్నారు.
అయితే సాయి పల్లవి విషయంలో మరో ఆసక్తికరమైన అంశం ఉంది.
ఆమె ఇప్పటివరకు పోషించిన పాత్రల్లో ఎక్కువ భాగం సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. పక్కింటి అమ్మాయిలా కనిపించడం, పాత్రలోని భావాలను పెద్దగా నటించకుండా పలికించడం ఆమెకు అలవాటైన శైలి.
కానీ సీత పాత్రకు అవసరమైన అభినయం కొంత భిన్నమైనది. అక్కడ కేవలం సహజత్వం సరిపోదు.
ప్రేక్షకులు సాయి పల్లవిని మాత్రమే చూడలేదు. తమ మనసుల్లో ఉన్న సీతను ఆమె ద్వారా చూడాలని ఆశించారు.
ఆ అంచనాలను అందుకోవడం ఎంతటి ప్రతిభావంతమైన నటికైనా సవాలే మరి!

