మాదాల రంగారావు తీసిన ‘ఎర్రమల్లెలు’ చిత్రంతో బాల నటుడిగా పరిచయమయ్యారు ఆయన తనయుడు మాదాల రవి. ఆ చిత్రంలోని “నాంపల్లి స్టేషన్ కాడి’ అనే పాట ఇప్పటికీ చార్ట్ బస్టర్గానే నిలుస్తోంది. ఆయన రష్యాలో ఇంటర్నల్ మెడిసిన్లో ఎండీ, గ్యాస్ట్రోఎంటరాలజీలో డీఎం పూర్తి చేశారు. అలాగే ఒక ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. ఆయన రష్యాలో భారతీయ సంస్థలకు, సాంస్కృతిక వ్యవహారాల విభాగానికి సాంస్కృతిక కార్యదర్శిగా కూడా సేవలందించారు.
భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, ఆయన తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి ‘నేను సైతం’, ‘మా ఇలవేల్పు’, ‘బ్రోకర్ 2’, ‘పంచముఖి’, ‘వీరగాధ’, ‘ఆజ్ కా ఇంక్విలాబ్’, ‘నాగలక్ష్మి’ వంటి అనేక చిత్రాలలో కథానాయకుడిగా నటించి, నిర్మించారు. నటుడిగా, చిత్రనిర్మాతగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.
ఇంటర్నల్ మెడిసిన్లో ఎం.డి, గ్యాస్ట్రోఎంటరాలజీలో డి.ఎం వంటి ప్రత్యేక వైద్య అర్హతలు కలిగిన డాక్టర్ మాదాల రవి గారి నిజమైన వైద్య సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
ప్రజా నాట్య మండలి, సీపీఐ, సీపీఐ(ఎం) వంటి వామపక్ష పార్టీల నాయకుడిగా, ఆయన అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించి, వాటిలో పాల్గొన్నారు. సామాజిక దురాగతాలు, అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజలలో చైతన్యం కలిగించడానికి కళే అత్యంత శక్తివంతమైన సాధనమని ఆయన గట్టిగా నమ్ముతారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఉపాధ్యక్షుడైన డాక్టర్ మాదాల రవి, వైద్య సేవలు, ఉచిత ఆరోగ్య శిబిరాల ద్వారా ‘మా’ సభ్యుల సంక్షేమానికి మద్దతునిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా, చిత్ర పరిశ్రమ, నిరుపేద కార్మికుల కోసం ఉద్దేశించిన అన్ని సంక్షేమ పథకాలలో ఆయన చురుకుగా పాల్గొన్నారు. అలాంటి డా. మాదాల రవి గారు మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుందాం!!

