సినిమా విడుదలైన తొలి రోజు వచ్చే టాక్‌ను బట్టి జయాపజయాలు నిర్ణయించే రోజులు క్రమంగా మారుతున్నాయి. మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకులే ప్రచారకర్తలుగా మారుతున్న ఈ కాలంలో, ‘చెన్నై లవ్ స్టోరీ’ అందుకు మరో మంచి ఉదాహరణగా నిలిచింది. విడుదల రోజు ఈ సినిమాపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. కథనం నెమ్మదిగా ఉందని, కమర్షియల్ అంశాలు తక్కువగా ఉన్నాయని, ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాకపోవచ్చని కొందరు అభిప్రాయపడ్డారు. దీంతో ఈ ప్రేమకథ బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు నిలబడుతుందనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి.
అయితే సినిమా చూసిన ప్రేక్షకులు మాత్రం భిన్నమైన తీర్పు ఇచ్చారు. కృత్రిమ హంగుల కంటే సహజమైన భావోద్వేగాలకు పెద్దపీట వేయడం, పాత్రల మధ్య అనుబంధాన్ని నిజాయితీగా ఆవిష్కరించడం, ప్రేమను ఆర్భాటంగా కాకుండా ఆత్మీయంగా చూపించడం ప్రేక్షకులను క్రమంగా ఆకట్టుకుంది.
సోషల్ మీడియాలో వచ్చిన సానుకూల స్పందన, ప్రేక్షకుల నోటి మాట, కుటుంబ ప్రేక్షకులు మరియు యువత నుంచి లభించిన ఆదరణ సినిమాకు కొత్త ఊపునిచ్చాయి. మొదట విమర్శించిన వారిలో చాలామంది కూడా తర్వాత సినిమా గురించి ప్రశంసలు వ్యక్తం చేయడం విశేషం.
ఈ విజయం మరో విషయాన్ని స్పష్టం చేసింది. ప్రేక్షకులు ఇప్పుడు భారీ సెట్లు, పెద్ద స్టార్ కాస్ట్ మాత్రమే చూడడం లేదు. హృదయాన్ని తాకే కథ, నిజాయితీగా చెప్పిన భావోద్వేగం, మనసుకు దగ్గరయ్యే పాత్రలు ఉంటే ఆ సినిమాను తమ భుజాలపై మోస్తున్నారు.
‘చెన్నై లవ్ స్టోరీ’ విజయం ఒక సినిమా విజయమే కాదు… మంచి ప్రేమకథలకు ప్రేక్షకులు ఇప్పటికీ పట్టం కడుతున్నారనే విషయానికి నిదర్శనం. ప్రేమను స్వచ్ఛంగా, హృదయానికి హత్తుకునేలా చెబితే ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తారనే నమ్మకానికి ఈ చిత్రం మరింత బలం చేకూర్చింది!!

