తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్
మీట్ ది ప్రెస్ లో “పద్మశ్రీ” మురళీమోహన్

ప్రముఖ నటులు, నిర్మాత మాజీ పార్లమెంటు సభ్యులు అయిన మాగంటి మురళీమోహన్…. భారతదేశపు నాలుగవ అత్యున్నత పురస్కారం “పద్మశ్రీ” పొందిన సందర్భంగా తెలుగు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ “మీట్ ది ప్రెస్” కార్యక్రమాన్ని నిర్వహించింది హైదరాబాదులోని ఫిలిం ఛాంబర్ లో ఏర్పాటయిన ఈ సమావేశంలో మురళీమోహన్ తన 53 ఏళ్ల నట జీవితాన్ని, 86 ఏళ్ల నిజ జీవితాన్ని సింహవలోకను చేసుకున్నారు. తన జీవితం మలుపు తిరగడానికి కారకులైన నలుగురు వ్యక్తులను (గుత్తా రామినీడు, అట్లూరి పూర్ణచంద్రరావు, దాసరి నారాయణరావు, శోభన్ బాబు) ఈ సందర్భంగా మురళీమోహన్ గుర్తు చేసుకున్నారు. ఆ నలుగురిలో ఇప్పటికే ముగ్గురు కాలం చేసినప్పటికీ… తన ఊపిరి ఉన్నంతవరకు వారిని స్మరిస్తూనే ఉంటానని మురళీమోహన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కొన్ని రాజకీయ కారణాలవల్ల తన సేవా కార్యక్రమాలకు కొంత విరామం ఇచ్చి ఉన్న తాను… త్వరలోనే వాటిని విస్తృతంగా పునః ప్రారంభిస్తానని ఈ సందర్భంగా తెలిపారు. “మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్” ద్వారా ఇప్పటివరకు వేయికి పైగా విద్యార్థినీ విద్యార్థులు లబ్ధి పొందారని, వారిలో చాలామంది ఉన్నత స్థాయిలో ఉండడం తనకు ఎంతో సంతృప్తినిస్తుందని ఆయన అన్నారు. “అతడు” సినిమా తర్వాత సినిమా నిర్మాణానికి గ్యాప్ ఇచ్చిన తాను త్వరలోనే సినిమా నిర్మాణం కూడా మొదలు పెడతానని ఆయన ప్రకటించారు. “పద్మశ్రీ” వచ్చిన సందర్భంగా తనతో ప్రత్యేకంగా ఈ “మీట్ ది ప్రెస్” కార్యక్రమాన్ని నిర్వహించిన తెలుగు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు!!

