రాజు వెడ్స్ రాంబాయి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో అఖిల్ రాజ్ ఉడ్డెమారి ఓ డెలివరీ బాయ్ మధ్య జరిగిన గొడవ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వివాదంపై వివరణ ఇచ్చారు హీరో అఖిల్ రాజ్. తప్పుడు అడ్రస్ కు ఫుడ్ డెలివరీ చేయడమే కాకుండా తన కుటుంబ సభ్యులు, తల్లిని దూషించినందుకే అతన్ని తాను మందలించానని అఖిల్ రాజ్ తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోను అఖిల్ రాజు రిలీజ్ చేశారు. ఈ వీడియోలో
అఖిల్ రాజ్ స్పందిస్తూ – ఆ రోజు మా ఇంట్లో ఎవరూ ఫుడ్ ఆర్డర్ చేయలేదు. అయినా ఫుడ్ పార్శిల్ వచ్చింది. మా అమ్మ ఆ పార్శిల్ తీసుకుని, ఎవరు ఆర్డర్ పెట్టారని అడిగింది. ఎవరూ ఆర్డర్ చేయలేదు అని తెలుసుకుని పక్కనే పెట్టేసింది. కొద్ది నిమిషాల తర్వాత ఫుడ్ డెలివరీ బాయ్ వచ్చి ఫ్రీగా వస్తే తీసుకుంటారా అంటూ మా అమ్మను దుర్భాషలాడాడు. తాగిన మత్తులో ఉన్న ఆ డెలివరీ బాయ్ మా అమ్మ మీదకు, మా కుటుంబ సభ్యుల మీదకు గొడవకు వచ్చాడు. ఒక కొడుకుగా వారిని కాపాడుకునే ప్రయత్నంలో డెలివరీ బాయ్ ను మర్యాదగా మాట్లాడమని మందలించాను. ఆ డెలివరీ బాయ్ ఆ వీడియో తీసి ఇదంతా సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. అసలు జరిగింది తెలుసుకోకుండా కొందరు నాపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. మీ కుటుంబ సభ్యులకు ఇలా జరిగితే ఊరుకుంటారా. నేను ఒక హీరోగా ఇంకాస్త సంయమనం పాటించాల్సి ఉండాల్సింది, పోలీసుల దృష్టికి తీసుకెళ్లాల్సింది. అయితే మా అమ్మను తిట్టినందుకు కోపం ఆపుకోలేకపోయాను. నేను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినవాడినే. ఇలా డెలివరీ బాయ్ పనులు చేసిన వాడినే. నా సినిమాలో కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ గురించే చెప్పాం. అలాంటి నేను అకారణంగా డెలివరీ బాయ్ తో ఎందుకు గొడవపెట్టుకుంటాను. అతనితో గొడవ పెట్టుకుంటే నాకు వచ్చేదేంటి. నన్ను సోషల్ మీడియా ద్వారా విమర్శిస్తున్న మిత్రుల కోసమే ఈ వివరణ ఇస్తున్నా. అన్నారు.

