మెగాస్టార్ చిరంజీవి పేరు వినగానే అభిమానుల కళ్ల ముందు మెదిలే ఎన్నో మాస్ పాత్రల్లో ‘ముఠామేస్త్రి’కి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. 1993 జనవరి 17న విడుదలైన ఈ చిత్రం అప్పట్లో విజయాన్ని అందుకోవడమే కాదు… చిరంజీవి మాస్ ఇమేజ్‌కు మరో బలమైన ముద్ర వేసింది. ఇప్పుడు రీ-రిలీజ్ సందర్భంగా మరోసారి థియేటర్లలోకి వస్తుండటంతో… నాటి జ్ఞాపకాలు నేటి తెరపై కొత్త సందడి చేయబోతున్నాయి.
చిరంజీవి సుభాష్ చంద్రబోస్ గా కనిపించిన ఈ సినిమాలో మీనా బుచ్చమ్మగా, రోజా కల్పనగా నటించారు. శరత్ సక్సేనా, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, గుమ్మడి, అల్లు రామలింగయ్య, జె.వి. సోమయాజులు, శ్రీహరి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
చిరంజీవి–కోదండరామిరెడ్డి కాంబినేషన్ అప్పటికే ప్రేక్షకులకు సుపరిచితం. ‘ముఠామేస్త్రి’తో ఈ జోడీ మరోసారి మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేసింది.
కథను భూపతిరాజా అందించగా, స్క్రీన్‌ప్లే, సంభాషణలను పరుచూరి బ్రదర్స్ అందించారు. కె.సి. శేఖర్ బాబు, డి. శివప్రసాద్ రెడ్డి నిర్మాతలు. ఛాయాగ్రహణం ఎస్. గోపాల్ రెడ్డి, ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు.
అంటే… కథ నుంచి మాటల వరకు, కెమెరా నుంచి ఎడిటింగ్ వరకు అందరూ అప్పటికి అగ్రపథంలో ఉన్నవారే.
‘ముఠామేస్త్రి’ గురించి మాట్లాడినప్పుడు పాటలను పక్కన పెట్టడం అసాధ్యం.
రాజ్–కోటి సంగీతంలో రూపొందిన ఈ చిత్ర ఆల్బమ్‌లో ఆరు పాటలు ఉన్నాయి. ‘ఈ పేటకు నేనే మేస్త్రీ’, ‘అంజనీ పుత్రుడా’, ‘చిక్ చిక్ చాం’, ‘వాన గడియారంలో’, ‘ఎంత ఘాటు ప్రేమయో’, ‘జోరుగున్నది’… ఒక్కో పాటక ఒక్కో ప్రత్యేకమైన బీట్ తో అలరిస్తుంది.
వేటూరి సాహిత్యం, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, మనో తదితరుల గానం… అప్పట్లోనే కాదు… ఇప్పటికీ రంజింపజేస్తూనే ఉన్నాయి.
అందులో ‘ఈ పేటకు నేనే మేస్త్రీ’ అంటే చిరంజీవి మాస్ ఇమేజ్‌కు దర్పణం. ఏళ్ల తర్వాత కూడా ఆ పాటలోని చిరంజీవి గెటప్, డ్యాన్స్ సోషల్ మీడియాలో కొత్త తరానికి కూడా ఆసక్తి కలిగిస్తోందీ.
అప్పట్లో చిరంజీవి తెరపై కనిపిస్తే థియేటర్లు ఈలలతో మార్మోగేవి.ఇప్పుడు అదే సన్నివేశాలు రీ-రిలీజ్‌లో కనిపిస్తే… ఆ ఈలలు వేసే అభిమానుల్లో నాటి ప్రేక్షకులతో పాటు నేటి తరం కూడా ఉంటుంది.
అదే చిరంజీవి స్టార్‌డమ్ ప్రత్యేకత.
కాలం మారింది.
సినిమా చూసే విధానం మారింది.
థియేటర్లలో సినిమా విడుదల చేసే పద్ధతి మారింది.
కానీ చిరంజీవి మాస్ ఇమేజ్ మాత్రం మారలేదు.
‘ముఠామేస్త్రి’ రీ-రిలీజ్ అంటే ఒక పాత సినిమాను మళ్లీ చూడటం మాత్రమే కాదు…
ఒక తరం చూసిన చిరంజీవిని… మరో తరం మళ్లీ సెలబ్రేట్ చేయడం!
నాటికీ మాస్…
నేటికీ మాస్…
ముఠామేస్త్రి ఒక్కడే!

