హ్యాట్సాఫ్ రాజశేఖర్ అండ్ ఫ్యామిలీ
(ధీరజ అప్పాజీ)
మొన్న హీరో రాజశేఖర్ గారింటికి వెళ్ళినప్పుడు నాకు చాలా రోజులు గుర్తుండిపోయేంత మంచి ఫీలింగ్ కలిగింది. అది మీతో పంచుకోకుండా ఉండలేకపోతున్నాను!!
అప్పటికే డోర్స్ ఓపెన్ చేసి ఉంచిన జీవితగారు మమ్మల్ని చాలా ఆత్మీయంగా రిసీవ్ చేసుకున్నారు. లివింగ్ రూమ్ లో మమ్మల్ని కూర్చోబెట్టారు. అక్కడున్న పెద్ద పెద్ద సోఫాలకు తోడు అదనంగా కుర్చీలు వేయడంలో తమ సహాయకురాలికి తను కూడా సహాయం చేస్తుంటే మాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఇంతలో వాళ్ళ రెండో అమ్మాయి (శివాత్మిక) వచ్చి అందరికీ నమస్కారాలు చేసి, ట్రేతో మంచినీళ్లు తెచ్చింది. ఈ ప్రేమపూర్వక ఆతిధ్యంతోనే మేమంతా ఉక్కిరిబిక్కిరి అవుతుండగానే… రాజశేఖర్ గారు నవ్వుతూఎంట్రీ ఇచ్చారు!!
అందరం లేచి ఆయనతో కరచాలనం చేసి, “బైకర్”తో మంచి “కమ్ బ్యాక్” ఇచ్చిన ఆయన్ను అభినందించాం. రాజశేఖర్ గారు అందరినీ పేరుపేరునా పలకరిస్తుండగానే… జీవితగారు, శివాత్మిక… బెల్లం పాకం జీడిపప్పు, మిక్చర్ తీసుకువచ్చారు. “ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్” గౌరవాధ్యక్షులు ప్రభుగారు, అధ్యక్షులు బత్తుల ప్రసాద్ గారు, ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి సారధ్యంలో డాక్టర్ రాజశేఖర్ ను అభినందించి…. ఫోటోలు తీయించుకున్నాం. మాలో ఫోటోలు తీసేవాళ్ళు ఫోటోల్లో మిస్సవుతున్నారని… ఫోటోలు తీసే బాధ్యత శివాత్మిక తీసుకుంటే నాకు భలే ముచ్చటేసింది!!
కెరీర్ బిగినింగ్ నుంచి తననెరిగిన సీనియర్ జర్నలిస్టులు బాల్ రెడ్డి గారు, మోహన్ గోటేటి గారు, మామిడిపల్లి గిరిధర్ గారు తదితరులతో కలిసి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోయారు రాజజీఖర్. “రేపటి పౌరులు, ప్రతిఘటన, వందేమాతరం, తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, మగాడు” నాటి రోజులు నెమరువేసుకుంటూ ఉండిపోయారు. ఆయా సినిమాలను నేను ఏ ఊర్లో, ఏ థియేటర్లో చూశానో గుర్తుకు తెచ్చుకుంటూ ఉండిపోయాను. ప్రస్తుతం తను చేస్తున్న రెండు సినిమాల విశేషాలు, వెల్లువలా వస్తున్న ఆఫర్స్ గురించి మాతో పంచుకున్నారు. పెద్దమ్మాయి శివాని షూటింగ్ లో ఉందా అని అడిగితే… లేదు అపోలోలో తన అప్రెంటిస్ చేస్తోందని చెప్పారు. సినిమాలు చేస్తూనే “ఎమ్.బి.బి.ఎస్” చేయడం అంటే మామూలు విషయం కాదు కదా అనిపించింది. ఇంతలో జ్యూస్, కాఫీ, టీలు కూడా జీవిత గారే స్వయంగా తీసుకురావడం నా మనసును మరింత కదిలించింది!!
మేము రాజశేఖర్ గారి ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి జీవితగారిని నిశితంగా గమనించకుండా ఉండలేకపోయాను. ఆమె “సింప్లిసిటీ” నన్ను కట్టిపడేసింది.
ఒక సాధారణ మధ్య తరగతి గృహిణిలానే అనిపించారు తప్ప… “సెలబ్రిటీ స్టేటస్” ఆమెలో అస్సలు కనిపించలేదు. తానొక ప్రముఖ హీరోయిన్ అని కానీ, డైరెక్టర్ అని కానీ ఆమెకు కొంచెం కూడా స్పృహ లేదు. తమ ఇంటికి చాలా రోజుల తర్వాత వచ్చిన తమ శ్రేయోభిలాషుల్ని రిసీవ్ చేసుకున్నట్లే అనిపించింది. గత పాతికేళ్లుగా మీడియాలో ఉంటున్న నాకే… మీడియా ద్వారా వాళ్లకు ఏర్పడిన “ఇమేజ్” ఇసుమంత కూడా కనిపించలేదు అక్కడ ఉన్నంతసేపు!!
మా భేటీలో జీవితగారిని కూడా మాతో జాయిన్ అవ్వమని ఒకటికి రెండుసార్లు అడిగినా…. ఆమె అతిధి మర్యాదలతోనే బిజీగా ఉండిపోయారు. రాజశేఖర్ గారు మాతో ముచ్చటిస్తుండగా… శివాత్మిక మధ్యలోకి వచ్చి వాళ్ళ నాన్న షర్ట్ కాలర్ సరి చేస్తుంటే…. నాకు మా అమ్మాయి గుర్తొచ్చి, ముద్దొచ్చింది!!
ఆరోజు… అప్పటికి కాసేపట్లో “బైకర్” సక్సెస్ మీట్ ఉందన్న విషయం మర్చిపోయి మరీ రాజశేఖర్ గారు మాతో ముచ్చటిస్తూనే ఉన్నారు. కానీ, ఆ విషయం మేమే గుర్తు చేసి, విడివిడిగా రాజశేఖర్ గారితో ఫోటోలు తీయించుకుని, సెలవు తీసుకున్నాం!!
రాజశేఖర్ గారు లిఫ్ట్ వరకు వచ్చి మమ్మల్ని సాగనంపడం నా మనసుకు హత్తుకుపోయింది. అదే “హైలైట్” అనుకుంటే… ప్రభుగారు మర్చిపోయిన సెల్ ఫోన్ ను… పనమ్మాయితో పంపించడం కాకుండా… శివాత్మిక స్వయంగా కిందకు తీసుకువచ్చి ఇవ్వడం నాకు ఎప్పటికీ గుర్తుంటుంది!!

