నేతాజి ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ల మీద రిచర్డ్ రిషి హీరోగా సోల చక్రవర్తి నిర్మింస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ద్రౌపది 2’. ఈ మూవీని మోహన్. జి తెరకెక్కిస్తున్నారు.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ఈ సినిమా నుంచి ‘ఎం కోనె..(నెలరాజె..)’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. పాట నేపథ్యాన్ని గమనిస్తే..
కాంచీపురం సంస్థానానికి చెందిన ద్రౌపది దేవి వివాహం కడవరాయ సంస్థానం నుంచి వీరసింహ కడవరాయన్‌తో జరుగుతుంది. అందులో హోయసాల రాజ్యానికి చెందిన మహారాజు వీర వల్లాల 3 (మూడవ వీర వల్లాలర్).. కడవరాయన్‌కు పట్టాభిషేకం చేసి పెళ్లి చేస్తారు. ఈ దంపతులు తల్లిదండ్రులయ్యే సందర్భంలో జరిగే సీమంతం వేడుకలో వీర వల్లాల మహారాజు కడవరాయన్‌కు ఓ బహుమతిని ఇస్తారు. ఈ సందర్భాన్ని సినిమాలో చిత్రీకరించిన సందర్భంలో వచ్చే పాటే ‘ఏం కోనె..’.
విలక్షణమైన సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానున్న ద్రౌపది 2 నుంచి రీసెంట్గా విడుదలైన ‘ఎం కోనె..’ (నెలరాజె..) సాంగ్ ట్రాక్‌కు సంబంధించిన పాట పాడిన సింగర్ చిన్మయి శ్రీపాద చేసిన వ్యాఖ్యలకు నెటిజన్స్ నుంచి విమర్శలు వచ్చాయి. దీనిపై చిత్ర దర్శకుడు మోహన్.జి స్పందించారు.
ఎం కోనె.. పాటను ఆలపించిన సింగర్ చిన్మయి.. పాట విడుదలైన కొద్దిసేపటి తర్వాత తన సోషల్ మీడియా ద్వారా ప్రజలకు క్షమాపణ చెప్పారు. రికార్డింగ్ సమయంలో ఈ సినిమా భావజాలం, దాని నేపథ్యం గురించి తాను తెలియకపోవటం వల్ల పాల్గొన్నానని, ప్రాజెక్ట్ గురించి ముందే తెలుసుకుని ఉంటే తాను ఇందులో ఇన్వాల్వ్ అయ్యేదాన్ని కాదని ఆమె వెల్లడించారు.
చిన్మయి క్షమాపణ చెప్పటం దీనిపై చిత్ర దర్శకుడు మోహన్.జి స్పందించారు. ఈ పాటను పాడటానికి తాను పర్సనల్‌గా చిన్మయి అయితే బావుంటుందని ఆమెతో పాడించానని పేర్నొన్నారు. రికార్డింగ్ సమయంలో చిత్ర సంగీత దర్శకుడు జిబ్రాన్ అందుబాటులో లేకపోవటంతో తాను ట్రాక్‌కు సంబంధించిన విషయాలను మాత్రమే వివరించానని, సినిమా కాన్సెప్ట్ గురించి ఎలాంటి చర్చ జరగలేదని దర్శకుడు తెలియజేశారు. తనతో కానీ, సంగీత దర్శకుడితో కానీ మాట్లాడకుండా, ఎలాంటి వివరణ తీసుకోకుండా ఇలాంటి కామెంట్స్ చేయటం ఆశ్చర్యాన్ని కలిగించిదని చెప్పిన డైరెక్టర్. దీనిపై చిన్నయి వివరణ ఇవ్వాలని లేదా ట్వీట్‌ను తొలగించాలని కోరారు.
ఈ సందర్భంగా ఎవరైనా విమర్శలు చేయాలనుకుంటే చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులను కాకుండా తనను విమర్శించాలని… సినిమా మేకింగ్‌లో భాగమైన ఇతరులను విమర్శించటం పిరికితనమని ఈ సందర్భంగా దర్శకుడు మోహన్.జి పేర్కొన్నారు.
చిన్మయి తన మెసేజ్‌లో పేర్కొన్న వ్యతిరేక భావజాలం గురించి దర్శకుడు మాట్లాడుతూ చిన్మయి ఇంటిపేరులో శ్రీపాద అని ఉంది. అది ఆమె ఆధ్యాత్మిక భావాన్ని తెలియజేస్తోంది. ఆమె ఏ భావజాల భేదాల గురించి మాట్లాడిందో తనకు స్పష్టంగా అర్థం కాలేదని ఆయన తెలియజేశారు.

