సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘పూలే’ సినిమాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం వీక్షించారు. శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత , ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో కలిసి అసెంబ్లీ నుంచి ఆర్టీసీ బస్సులో ప్రసాద్ ల్యాబ్‌కు చేరుకున్నారు. సామాన్య ప్రజల మాదిరిగానే ప్రజాప్రతినిధులందరూ బస్సులో ప్రయాణించడం విశేషం.
సీఎం ప్రయాణిస్తున్న బస్సుకు పోలీసులు భారీ భద్రత కల్పించారు.అనంత్ మహదేవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ హిందీ చిత్రం గతేడాది ఏప్రిల్ 25న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చిత్రంలో జ్యోతిరావు పూలేగా ప్రతీక్ గాంధీ, సావిత్రీబాయి పూలేగా పత్రలేఖ పాల్ నటించారు. కుల నిర్మూలన కోసం ఆ దంపతులు చేసిన పోరాటాన్ని, మహిళా విద్య కోసం వారు ఎదుర్కొన్న సవాళ్లను సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. సామాజిక సంస్కర్తల జీవితాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు.





