నందమూరి బాలకృష్ణకు గాయం.. ఏఐజీ ఆసుపత్రికి తరలింపు
ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఎడమ మోకాలికి గాయమైంది.
రాజమండ్రిలో జరుగుతున్న సినిమా షూటింగ్లో పాల్గొంటున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది.
వెంటనే ఆయనకు స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక వైద్య చికిత్స అందించారు.
మెరుగైన వైద్య పరీక్షలు, ప్రత్యేక చికిత్స కోసం ఆయన్ను ఎయిర్‌లిఫ్ట్ ద్వారా హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.
- బాలకృష్ణ ఎడమ మోకాలి చుట్టూ ఉన్న కణజాలాలలో రక్తం గడ్డకట్టడంతో పాటు వాపు ఉన్నట్లు ప్రాథమిక పరీక్షల్లో తేలింది. ఇది ఆ ప్రాంతంలో (మజిల్ టేర్) సూచిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
ప్రస్తుతం ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం పర్యవేక్షణలో ఆయన విస్తృతమైన క్లినికల్, డయాగ్నస్టిక్ పరీక్షలు చేయించుకుంటున్నారు.
నిలకడగా ఆరోగ్య పరిస్థితి…..
ఆయన గత వైద్య చరిత్రను దృష్టిలో ఉంచుకుని, తగిన సురక్షితమైన చికిత్సను నిర్ణయించేందుకు వివిధ విభాగాల నిపుణులతో కూడిన మల్టీడిసిప్లినరీ బృందం ఆయన ఆరోగ్యాన్ని పరిశీలిస్తోంది.
- ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత తుది చికిత్స ప్రణాళికను ఖరారు చేయనున్నారు. తదుపరి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తామని వైద్యులు తెలిపారు.

