కాలానుగుణమైన హాస్యం, సున్నితమైన వ్యంగ్యం, ఎక్కడా హద్దులు దాటని సెన్సిబుల్ కామెడీ… ఈ మూడింటినీ ఇంత సహజంగా కలిపిన అరుదుగా వచ్చిన అతి తక్కువ తెలుగు టెలివిజన్ సీరియళ్లలో “అమృతం” ఒకటి.
అమృతం గొప్పతనం ఏమిటంటే, నవ్వించడానికి ఎదుటివారిని కించపరచాల్సిన అవసరం లేదని నిరూపించడం.
అమాయకత్వం, అత్యాశ, అహం, మధ్యతరగతి ఆలోచనలు, వ్యాపార ధోరణులు, మనుషుల సంబంధాలు… మన చుట్టూ కనిపించే మనుషుల స్వభావాల్లోనే హాస్యాన్ని వెతుక్కుంది.
ఒకప్పుడు మనం టీవీలో చూసి నవ్వుకున్న కొన్ని విషయాలు, ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే సమాజంలో వచ్చిన మార్పులకు ప్రతిబింబాలుగా కనిపిస్తాయి. అందుకే అమృతం కేవలం ఒక కామెడీ సీరియల్ కాదు. కాలానుగుణమైన, సున్నితమైన, హుందాతనంతో కూడిన సెన్సిబుల్ కామెడీకి ఒక బెంచ్‌మార్క్. ఈ తరహా కామెడీకి చిట్టచివరి పేజీ అమృతమే అనిపిస్తుంది.
సీరియల్ అంతా ఒక ఎత్తైతే…టైటిల్ సాంగ్ మరో మెట్టు పైన ఉంటుంది.

ఈ పాట ఇన్నేళ్లయినా మన చెవుల్లో రింగుమనడానికి కల్యాణి మాలిక్ సంగీతం ఎంత కారణమో… శాస్త్రి గారి సాహిత్యం అంతకు మించి కారణం!
సినిమా పాట రాయడానికి, నడి రాత్రులు ఉదయించి కలం కదిపే సీతారాఁవుడు…నడి సంద్రంలో కొట్టుకుపోతున్న ప్రతి మధ్యతరగతి ప్రేక్షకుడినీ …పొట్టమీద వేలు పెట్టి పుచుక్కున పొడిచి “అరేయ్…నువ్వు ఈదేది సంసార సాగరం కాదురా డిప్పం. చెంచాడు భవసాగం అంతే” అని నవ్విస్తూనే తత్వం మొత్తం నూరిపోసేసే పాట అది.
మన చేతుల్లోనే రిమోట్ కంట్రోల్ ఉందనే చమత్కారం దగ్గరే ఆ విషయం అర్థమవుతుంది. ఏడుపుగొట్టు కార్యక్రమాల్ని మార్చేయమంటారు. చూస్తే మనకు నచ్చని దృశ్యాల్ని, మనల్ని బాధించే ఆలోచనల్ని మార్చుకునే అవకాశం మన చేతుల్లోనే ఉందనేదే బోధ.
మనిషి తన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకూ పరిస్థితుల్ని, సమాజాన్ని, ఇతరుల్ని కారణంగా చూపిస్తుంటాడు. అఫ్కొర్స్ అప్పుడే వాడు మనిషవుతాడు. కానీ తన చేతిలో ఉన్న చిన్న అవకాశాన్ని ఉపయోగించుకోవడం మాత్రం మర్చిపోతుంటాడు. ఆ మానవ నైజాన్ని ఒక రిమోట్ కంట్రోల్‌తో పోల్చడం ఎంత సరదామాటో, అంతే ఆలోచనాత్మకం!
ఇక మనకు ఎదురయ్యే కష్టాల్ని వార్తల్లో వచ్చే హెడ్‌లైన్స్‌తో పోల్చడం మరో అద్భుతమైన పరిశీలన. ప్రపంచంలో జరిగే పెద్ద పెద్ద పరిణామాలతో పోలిస్తే మన రోజువారీ సమస్యలు ఎంత అల్పమైనవో గుర్తుచేస్తారు.
అయోడిన్‌తో పోయే గాయాన్ని కూడా పెద్ద గండంగా భావించే మన మనస్తత్వం చూస్తే…సాయంత్రం ఇంటికొచ్చిన నాన్నకి రెండేళ్ళ పిల్లాడు “నాన్నా…బూ బూ” అని ఎక్కడో చడ్డీ వల్ల పడ్డ అచ్చుల్ని చూపించిన దానికీ, గోరంతలు కొండంతలు చేసుకునే మనకీ పెద్ద తేడా ఏముంటుందీ అనిపిస్తుంది.
ఇక ‘ఒక చెంచాడు భవసాగరాలు’ అనే భావన దగ్గర ఆగి ఆలోచించకుండా ఉండలేం.
భవసాగరం అంటే జనన మరణాల చక్రం, సంసార బంధాలు, అంతులేని జీవిత ప్రయాణం… ఇలా ఎన్నో గంభీరమైన తాత్విక భావనలు గుర్తుకొస్తాయి. అలాంటి భవసాగరాన్ని ఒక చెంచాడు పరిమాణానికి కుదించేయడం ఎంత లోతైన, అందమైన ఊహ!
మనిషి తన జీవితాన్ని ఒక మహాసముద్రంలా భావించి ఈదుతుంటాడు. కానీ ఆ సముద్రంలో చాలాసార్లు మనమే సృష్టించుకున్న ఆందోళనలు, మనమే పెంచుకున్న సమస్యలు, మనమే వేసుకున్న పరిమితులు ఉంటాయి. వాటిని కొంచెం దూరం నుంచి చూసుకుంటే అవి ఒక చెంచాడు పరిమాణంలోకి కుదించుకుపోవచ్చు.
మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేయాలనే ఉపదేశం ఇందులో లేదు. “ప్రతీ దానికీ ఓ…ఇదైపోకు” అనే సూచన మాత్రమే ఇస్తారు శాస్త్రి గారు.
కూరలో కారం ఎక్కువైతే కన్నీళ్లు, రాత్రంతా దోమలతో యుద్ధం… ఇవన్నీ మన రోజువారీ జీవితంలో భాగాలే. ప్రపంచంలో ఎన్నో పెద్ద సమస్యలున్నా, మన ఇంట్లో ఆ క్షణానికి అవే పెద్ద సమస్యలు. ఈ చిన్న చిన్న అసౌకర్యాల్ని అంతర్జాతీయ యుద్ధాలతో పోల్చడం… అమృతం టైటిల్ సాంగ్‌లో నాకు నచ్చేది.
ఈ సాహిత్యానికి కల్యాణ్ మాలిక్ గారి సంగీతం కూడా అంతే చక్కగా తోడైంది. పదాల్లోని చిలిపితనం, వ్యంగ్యం, ఉత్సాహం స్వరాల్లోనూ ప్రతిధ్వనించాయి.
అదే ఆ పాటకున్న అసలైన అమృతత్వం!
ఇక అమృతం సీరియల్లో… ముఖ్యంగా మాదాపూర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో చిత్రీకరించిన ఎపిసోడ్లను మళ్లీ మళ్లీ చూస్తుంటాను. కథలోని హాస్యం కోసం ఒకసారి చూస్తే, ఆ తర్వాత ఆ రోడ్లను గుర్తుపట్టడం కోసం చూస్తుంటాను.
ఇప్పటి మాదాపూర్ రోడ్లను చూస్తూ, అప్పటి ఎపిసోడ్లలో కనిపించిన ప్రదేశాలతో పోల్చుకుంటాను. అప్పటి రోడ్లు, పరిసరాలు, భవనాలు… ఇవన్నీ నేను హైదరాబాద్ సిటీకి వచ్చిన కొత్తల్లో వాతావరణంలోకి తీసుకెళ్తాయి.
ఒక సీరియల్లో ఇన్ని జ్ఞాపకాలు దొరుకుతాయని అప్పట్లో అనుకోలేదు. ఇది ఒక దాచుకున్న జ్ఞాపకాల ఆల్బమ్ కూడా.
చాలామందికి రకరకాల Stress Busters ఉంటాయి. ఎవరికో సంగీతం, ఇంకొకరికి పుస్తకాలు, మరొకరికి ప్రయాణాలు. నాకు వీటితో పాటు అమృతం ఒక పెద్ద Stress Buster. కనీసం దాని టైటిల్ సాంగ్ అయినా సరే! ఎప్పుడైనా ఏదైనా భవసాగరం అనిపిస్తే…
ఆ పాట పెట్టుకుంటే చాలు. శాస్త్రిగారు శ్రీ కృష్ణుడి వేషంలో అమృతగీత వినిపించేస్తారు.
నాకూ మనోభావాలు, మరో భావాలు ఉన్నాయి. అవీ కొన్ని ఎపిసోడ్లలో దెబ్బతిన్నాయి. కానీ దెబ్బతిన్న భావాల కంటే…నా దెబ్బలకి ఆయింట్మెంట్ రాసినవే ఎక్కువ!
పాతికేళ్ళ అమృతానికి .. Gangaraju Gunnam గారు &
టీమ్ కి అభినందనలు 🍀🌹💐
