కథా రచయిత్రి,సాహిత్యకారిణి
శ్రీమతి లక్ష్మీ మదన్
తెలంగాణ మట్టి పరిమళాలు వెదజల్లుతూ సినిమా చాలా బాగుంది.
కథనాన్ని వాస్తవంగా చూపిస్తూ అల్లుకోవడం చాలా బాగా అనిపించింది. సినిమా మొత్తం తెలంగాణ పల్లెలలోనే తీసినట్లుగా ఉంది. ఆ ఇండ్లు, వీధులు అన్ని చూస్తుంటే నా చిన్నతనంలో తిరిగాడిన ఊళ్ళ లాగానే అనిపించింది.
ఇందులో పాత్రలను పోషించిన ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా చేశారు.
నరేష్ గారు తెలంగాణ వారు కానప్పటికీ తన నటనతో ఆహా! అనిపించారు. అతని ఇద్దరు కూతుళ్ళలో ఒక కూతురు తరుణ్ భాస్కర్ గారి ( బాల రాజు)భార్య. ఇతను తాగుబోతుగా ఉండి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం వల్ల ఆ అమ్మాయి బాధపడుతూ ఉంటుంది. ఈ పాత్రలో తరుణ్ భాస్కర్ గారు చాలా బాగా నటించారు. తెలంగాణ మాండలి కం వంట పట్టించుకున్న వాడే కాబట్టి అతడు నటించాడు అనే దానికన్నా జీవించాడనే చెప్పవచ్చు. చిన్నమ్మాయి తనకంటూ ఒక వ్యక్తిత్వం ఏర్పరచుకొని చదువుకోవాలి అనే తపన ఉంటుంది. మధ్యతరగతి కుటుంబాలలో ఆ చదువుకోవడం కూడా కష్టంగానే ఉంటుంది. అలాంటి పాత్రల్లో అనుపమ పరమేశ్వరన్ నటించి మెప్పించారు.
మన తెలంగాణ చేనేతలను గుర్తించి అగ్గిపెట్టిలో ఇమడగలిగే చీరను చూపించడం ఎంతో నచ్చింది. చక్కని ఆ చీరను ప్రేమగా తన స్నేహితురాలికివ్వడము, ఆమె కట్టుకుంటే మురిసిపోవడం జరుగుతుంది.

పెద్ద అల్లుడు తాగుబోతు కావడం వల్ల ఎన్నో అవమానాల పాలవుతూ ఉంటాడు పర్వతాలు. ఒక పంచాయతీ మీటింగ్లో అల్లుడు వల్ల అవమానం పొంది బాధతో ఇంటికి వచ్చి చిన్న కూతురుకి మంచి సంబంధం చేయాలనుకుంటాడు. అదే విషయం భార్యతో మాట్లాడి బావమరిదిని పిలిపించుకుంటాడు.
బావమరిది పాత్రలో చేసిన వ్యక్తి జబర్దస్త్ లో నటించి మరెన్నో సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు,నటుడు,రైటర్ తమ్ముడు లక్ష్మీ కిరణ్. అతని నటన గురించి చెప్పేదేముంది! చక్కని భావ వ్యక్తీకరణతో భావాన్ని పండించాడు. మధ్యతరగతి ఇళ్లల్లో ఏ కష్టం వచ్చినా అక్కకు తమ్ముడు సహాయం చేయడం ఆనవాయితీ. అదే పాత్రను బాధ్యతగా పోషించడానికి అక్క పిలవగానే వస్తాడు.
అలా మేనమామ ఎన్నో సంబంధాలు చూడటం తండ్రి మ్యారేజ్ బ్యూరోలో తన కూతురి ఫోటో ఇచ్చి సంబంధాలు చూపించమని అడగటం ఇలా ఎన్నో సంబంధాలు వస్తుంటే అన్నిటిని రిజెక్ట్ చేస్తూ ఉంటాడు.
బంధువులలో ఒకరికి అమెరికా సంబంధం వస్తుంది. ఆ సంబంధాన్ని చూసి ఆ ఇంటి సభ్యులు అందరూ మురిసిపోతుంటే పర్వతాలు వెళ్లి తన కూతురికి ఇలాంటి సంబంధం వచ్చి వేరే వాళ్లకు మంచి సంబంధం వచ్చిందని భరించలేక వాళ్ళని ఇంటికి పిలుస్తాడు. ఇక్కడ సహజమైన అసూయను నరేష్ అద్భుతంగా ప్రదర్శించాడు.
మేనమామ పాత్రలో నటించిన లక్ష్మి కిరణ్ నిజంగా ఈయన సొంతమేనమామనేనా అన్నట్లు అనిపిస్తుంది.
తాగుబోతుగా నటించిన బాలరాజు గాంధీ బొమ్మ చేతిలో కర్ర లేదని గుర్తించి కర్రను పెట్టడం ఇది దేశభక్తిని చూపించింది.
ఇక చిన్న కూతురును ప్రేమించిన అతను ఉద్యోగము వద్దనుకొని చేనేత కోసం ఏదైనా చేయాలనుకుని ఒక ఆప్ ని క్రియేట్ చేస్తాడు. మన తెలంగాణ చేనేతకు చేయూతగా ఇది నాకు చాలా నచ్చింది.
తల్లిని చెరొక నెల ఇంట్లో ఉంచుకోవడం, ఇళ్లల్లో జరిగే సహజ వాతావరణం కొంత చూపించడము ఇవన్నీ బాగా చూపించారు. ఆమె మనవరాలు దగ్గర సంతకం నేర్చుకుంటానని తన సంతకం తను చూసుకోవాలని ఆరాట పడటం కనిపిస్తుంది.
తెలంగాణ వంటకాలు కూడా ప్రతిబింబించేలాగా చూపించడం ఎంతో బాగుంది. ఊళ్ళలో ఆడపిల్లల్ని పెళ్లి చూపులకు చూపించినప్పుడు మరొక పెళ్లీడుకున్న అమ్మాయిని కనిపించకుండా పెడతారు. ఒకరి సంబంధం ఒకరికి పోతుందని అలాంటి చిన్న చిన్న అసూయలు ఈ సినిమాలో కనిపిస్తాయి. అన్న కూతురుకు వచ్చిన సంబంధం ఎత్తగొట్టి తన కూతుర్ని ఇవ్వాలని ఆరాటపడే పాత్రలో నరేష్ బాగా నటించాడు. అదే తండ్రి పాత్రలో కూతురు ఇష్టాన్ని గౌరవించే తండ్రిగా ఎంతో ఎత్తుకు ఎదుగుతాడు.
కీర్తిని ఒక మంచి చోటికి తినడానికి తీసుకెళ్తానని చెప్పి తపాలా రొట్టె తినిపించడం తెలంగాణ వంటకాలను హైలెట్ చేసినట్లు అనిపించి సంతోషంగా అనిపించింది.
అమెరికా సంబంధం వారు పర్వతాలు చిన్న కూతురిని చేసుకుంటానని చెప్పడం ఇతను సంతోషంతో కూతురికి చెప్పకుండానే సంబంధం కాయం చేసుకోవడానికి వెళ్ళటం,అక్కడ పెద్దలు కూడా వెంట తీసుకెళ్లి అతని సాఫ్ట్వేర్ అని చెప్పించడం అక్కడ చమత్కారమైన సంభాషణలు నడుస్తాయి. తరుణ్ భాస్కర్ చక్కని హాస్యాన్ని కూడా పండించారు. కొన్ని సంభాషణలు భలే నవ్వు పుట్టించాయి.
ఊళ్ళలో ఆర్ఎంపీ డాక్టర్లు రోగికి హాస్పిటల్స్ కి మధ్య అనుసంధానమై కేసులను ఎలా కుదుర్చుకుంటారో బాగా చూపించారు. ఇప్పటికీ ఊళ్ళలో అలాగే జరుగుతూ ఉంటుంది.
కీర్తి అమెరికా సంబంధం ఎలా తప్పించుకోవాలని ప్లాన్ చేస్తూ ఇంగ్లీష్ ను అడ్డం పెట్టుకొని స్పోకెన్ ఇంగ్లీష్లు క్లాసులో చేరడం, అక్కడ కామెడీ చాలా అద్భుతంగా ఉంటుంది. అవన్నీ మనకు కళ్ళముందు జరుగుతున్న సంఘటనలు గానే కనిపిస్తాయి. ఆ తర్వాత ఒక వ్యసనాన్ని మాన్పించడానికి ఒట్టు వేయించుతుంటారు. అలా బాలరాజుకు తాగకూడదని ఒట్టు వేయించడం అతను తాగకుండా ఉండలేకపోవడం, ఒట్టు తీసి గట్టు మీద పెట్టుమని అడగటం ఇవన్నీ మనము చూసిన సంఘటనలు గానే మనకు కనిపిస్తాయి. ప్రతి చిన్న విషయాన్ని ఎక్కడ మర్చిపోకుండా అద్భుతంగా చూపించగలిగారు. చివరికి పెంకుటిల్లు కప్పుతుంటే ఆ పాత పెంకలను జాగ్రత్త పెట్టమని ఇలాంటివి అన్ని మన మనసుకి దగ్గరగా ఉన్న సంఘటనలే.
అసలు డైలాగ్స్ ఎంత బాగున్నాయంటే ప్రతి ఒక్క సన్నివేశం ఎంతో బాగుంటుంది. మధ్యతరగతి వాళ్లు ఇవన్నీటిని చిన్నప్పటినుండి చూసినవే.. వీటిని మళ్లీ మననం చేసుకున్నట్లు అనిపించింది.
ఏదో అతికించినట్టు కాకుండా ప్రతి విషయాన్ని చక్కగా ఆవిష్కరించారు. పిండి విసరడం దగ్గర నుండి ఏ ఒక్కటి విస్మరించకుండా నాచురల్ గా చూపించారు.
నిజంగా సినిమా క్రేజీ గానే ఉంది. అయితే మరి నేను సినిమా మొత్తం చెప్తే చూసే వాళ్ళకి ఎలా!
కీర్తి అమెరికా సంబంధం తప్పించుకుందా? తాను ప్రేమించిన అబ్బాయిని చేసుకుందా? అతను చేనేత గురించి పెట్టిన యాప్ సక్సెస్ అయ్యిందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే తప్పకుండా క్రేజీ కల్యాణం సినిమా చూడాల్సిందే!
ఇందులో నటించిన వాళ్లు నిజంగానే జీవించారు. అంత చక్కటి కథ . కథనం నడిపించిన తీరు కూడా చాలా బాగుంది.
ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నాను.
తప్పక చూడవలసిన సినిమా! సెంటిమెంటు హాస్యం అన్నింటినీ దర్శకుడు బాగా పండించాడు.
అనుపమ పరమేశ్వరన్ కూడా చాలా బాగా నటించింది. చాలా సినిమాల్లో తెలంగాణ భాషని తెచ్చి పెట్టుకున్నట్లుగా ఉంటుంది. కానీ ఇందులో ప్రతి ఒక్కరు బాగా మాట్లాడారు.
క్లైమాక్స్ లో నరేష్ పండించిన తీరు అద్భుతం. అతను కామెడీని ఎలా చేయగలడు బాధను కూడా అలా వ్యక్తపరచగలడు. అది సినిమాకే హైలెట్.
**
మా సినిమాను చూసి ఇంత చక్కటి సమీక్షనందించిన” ప్రముఖ రచయిత్రి, సాహిత్యకారిణి శ్రీమతి లక్ష్మీ మదన్ అక్క గారికి మా క్రేజీ కళ్యాణం సినిమా టీమ్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🌹🍀
