-రేణు దేశాయ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో విడిపోయి 14 ఏళ్లు గడిచినా తనను ఇంకా ఆయన మాజీ భార్యగానే గుర్తించడం పట్ల నటి రేణు దేశాయ్ తీవ్ర అసహనం, ఆవేదన వ్యక్తం చేశారు. తనకంటూ ఒక వ్యక్తిత్వం, కెరీర్, జీవితమున్నాయనే విషయాన్ని ఎందుకు గుర్తించడం లేదంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా శ్రీరాముడి 14 ఏళ్ల వనవాసాన్ని ప్రస్తావిస్తూ… ‘శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం చేశారు. మరి నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది?’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన రేణు దేశాయ్ తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న విమర్శలు, సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి మనసు విప్పారు. తెలుగు ప్రేక్షకులు తన జీవితాన్ని ‘బద్రి’ సినిమాతోనే ముడిపెట్టి చూస్తున్నారని, అంతకుముందు తనకంటూ ఒక జీవితం ఉందనే విషయాన్ని కూడా విస్మరిస్తున్నారని అన్నారు.
పవన్ కల్యాణ్‌తో 2012లో విడాకులు తీసుకున్న తర్వాత తాను ఎన్నో పనులు చేశానని రేణు గుర్తు చేశారు. ఒక మరాఠీ సినిమాను నిర్మించానని, అది మంచి విజయాన్ని సాధించిందని చెప్పారు. మరో సినిమాకు కథ అందించడంతో పాటు నిర్మాణం, దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టానని వెల్లడించారు. డ్యాన్స్ షోల్లో పాల్గొనడం, కవిత్వం రాయడం, నటిగా మళ్లీ సినిమాల్లోకి రావడం వంటి అనేక పనులు చేశానని వివరించారు. తనకు వ్యక్తిగత గుర్తింపే లేకపోతే ఇన్ని అవకాశాలు ఎలా వస్తాయని ఆమె ప్రశ్నించారు!!

