
జర్నలిస్ట్ గా ప్రభు 40 ఏళ్ల టాలీవుడ్ జర్నీ ఈవెంట్
గద్దర్ అవార్డ్ పొందిన ప్రభు రచన “శూన్యం నుండి శిఖరాగ్రాలకు” పార్ట్ 2 పుస్తక ఆవిష్కరణ
ప్రభు సతీమణి స్వర్గీయ ఆడెపు దుర్గా మాధవి ప్రభు ఛారిటబుల్ ట్రస్ట్ ప్రారంభం
“శూన్యం నుండి శిఖరాగ్రాలకు” పార్ట్ 2 పుస్తక ఫస్ట్ కాపీని రూ.5 లక్షలకు కొనుక్కున్న ప్రొడ్యూసర్ ఆదిత్య రామ్
ఆడెపు దుర్గా మాధవి ప్రభు ఛారిటబుల్ ట్రస్ట్ కు 11 లక్షల 11 వేల 11 వందల 11 రూపాయలు విరాళం ప్రకటించిన నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు
సినీ పరిశ్రమలో ఇటు మీడియాకు, అటు 24 క్రాఫ్టుల వారికి ఆప్తుడిగా ఉంటూ జర్నలిస్ట్ ప్రభు 40 ఏళ్ల ప్రయాణం చేస్తున్నారు. ఆయన పుట్టినరోజుతో పాటు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ఎఫ్ఎన్ సీసీలో గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభు రచించిన, గద్దర్ అవార్డ్ పొందిన శూన్యం నుండి శిఖరాగ్రాలకు పార్ట్ 2 పుస్తక ఆవిష్కరణ జరిపారు. అలాగే స్వర్గస్తులైన ప్రభు సతీమణి ఆడెపు దుర్గా మాధవి ప్రభు ఛారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో చిత్ర పరిశ్రమకు, మీడియాకు చెందిన ప్రభు మిత్రులు ఎంతోమంది పాల్గొన్నారు. దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, రేలంగి నరసింహారావు, నిర్మాతలు అచ్చి రెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, చదలవాడ శ్రీనివాసరావు, ఆదిత్యరామ్, కాట్రగడ్డ ప్రసాద్, తుమ్మలపల్లిరామసత్యనారాయణ, నటులు సుమన్, జేడి చక్రవర్తి, ఉత్తేజ్, కొరియోగ్రాఫర్ సుచిత్ర చంద్రబోస్, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ ప్రముఖులు, మీడియా మిత్రులు, ప్రభు గారి కుటుంబ సభ్యులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. చెన్నైకు చెందిన ఆదిత్య రామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ఆదిత్యరామ్ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేయడం విశేషం. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన నాగేంద్రకుమార్ శూన్యం నుండి శిఖరాగ్రాలకు పార్ట్ 2 పుస్తక తొలి కాపీని లక్ష రూపాయలకు కొనుగోలు చేయాలని కోరగా. లక్ష కాదు 5 లక్షల రూపాయలకు కొంటానని చెప్పడం సభలో అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ప్రభు గారు ఆయన భార్య పేరు మీద నెలకొల్పిన ఆడెపు దుర్గా మాధవి ప్రభు ఛారిటబుల్ ట్రస్ట్ కు 11 లక్షల 11 వేల 11 వందల 11 రూపాయలు విరాళం ప్రకటించారు. ప్రొడ్యూసర్ ప్రసన్నకుమార్ ద్వారా అవసరంలో ఉన్న వారికి ఈ సాయం అందిస్తానని తెలిపారు.
నిర్మాత ఆదిత్య రామ్ మాట్లాడుతూ – ప్రభు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ రోజు ఆయన శూన్యం నుండి శిఖరాగ్రాలకు పార్ట్ 2 పుస్తకం ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉంది. సినిమా జర్నలిజం పట్ల ఆయనకున్న ప్యాషన్ ఈ పుస్తకం సైజ్ చూస్తే తెలుస్తోంది. ఈ పుస్తకాన్ని మూడు పుస్తకాల కింద తీసుకురావొచ్చు. అంత సమాచారం చేర్చారు. ఈ పుస్తక ఫస్ట్ కాపీని 5 లక్షల రూపాయలకు కొనుక్కుంటున్నా. ప్రభు గారు జర్నలిజంలో ఇలాగే ఎనర్జిటిక్ గా కొనసాగాలని కోరుకుంటున్నా. అన్నారు.
నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ – సినీ పాత్రికేయుల్లో ప్రభు ప్రత్యేకంగా నిలుస్తారు. ప్రజలకు ఎలాంటి సమాచారం అందించాలో ఆ సమాచారాన్ని అందించి అందరి ప్రశంసలు పొందారు. ఆయన మరెన్నో ఏళ్లు ఇలాగే పరిశ్రమాలో మనందరితో కలిసి ప్రయాణం చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటుడు సుమన్ మాట్లాడుతూ- నాకు ప్రభు అంటే ప్రత్యేకమైన గౌరవం, అభిమానం. ఈ నలభై ఏళ్లలో ఎన్నో మెమొరీస్ ఆయనతో మాకు ఉన్నాయి. ప్రభు మరింత సక్సెస్ ఫుల్ గా తన ప్రయాణం కొనసాగించాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అన్నారు
నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ – జర్నలిస్ట్ గా ప్రభు ఎంత ప్రతిభావంతుడో, వ్యక్తిత్వంలో అంత గొప్పవాడు. ఎంతోమందికి సహాయం చేయించారు. ఆయన వందో పుట్టినరోజు కూడా మనం జరపాలని కోరుకుంటున్నా. ఆడెపు దుర్గా మాధవి ప్రభు ఛారిటబుల్ ట్రస్ట్ కు నా వంతు సపోర్ట్ అందిస్తూ 11 లక్షల 11 వేల 11 వందల 11 రూపాయల విరాళం ప్రకటిస్తున్నా. ప్రభు గారు ఎవరికి ఆ సాయం అందించమని చెబితే వారికి అందజేస్తాను. అన్నారు.

జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ – సినీ పాత్రికేయుడిగా నా ప్రస్థానం 1986 నుంచి 2026 వరకు 40 ఏళ్లకు చేరుకుంది. ఇది నా కెరీర్ లో గొప్ప సందర్భంగా భావిస్తున్నా. ఈ నాలుగు దశాబ్దాల ప్రయాణంలో చిత్ర పరిశ్రమలోని ఎంతోమంది గొప్పవారితో పరిచయం, అనుబంధం ఏర్పడటం, నేను వారి ప్రశంసలు, ప్రేమ పొందడం నా అదృష్టం. పాత్రికేయుడిగా మనం ఏం రాసినా అది చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఉపయోగపడాలని భావించిన పాత్రికేయుడిని నేను. ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూసే ప్రయత్నం ఏనాడూ చేయలేదు. ఆ నియమాన్ని పాటిస్తూ వచ్చాను. ప్రొఫెషనలిజాన్ని నమ్ముకున్నాను. నన్ను స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది కొత్తవాళ్లు జర్నలిజంలోకి వచ్చారు. దాసరి గారిని, నిర్మాత వడ్డే రమేష్ గారిని నా జీవితంలో మర్చిపోలేను. స్వర్గస్తులైన నా భార్య దుర్గా మాధవి సేవా గుణాన్ని కొనసాగిస్తూ ఆడెపు దుర్గా మాధవీ ప్రభు ఛారిటబుల్ ట్రస్ట్ ప్రారంభిస్తున్నాను. అన్నారు.

