
‘పెళ్లిచూపులు’తో గుర్తింపు.. ‘అర్జున్ రెడ్డి’తో సంచలనం.. ‘గీత గోవిందం’తో తిరుగులేని స్టార్డమ్! విజయ్ దేవరకొండ కెరీర్‌ను మలుపు తిప్పిన ఈ మూడు చిత్రాలు అతడిని టాలీవుడ్లో ప్రత్యేకమైన కథానాయకుడిగా నిలబెట్టాయి. కానీ ఆ తర్వాతి ప్రయాణం మాత్రం ఆశించిన స్థాయిలో సాగడం లేదు.
‘నువ్విలా’, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’, ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రాలతో నటుడిగా ప్రయాణం ప్రారంభించిన విజయ్‌కు ‘పెళ్లిచూపులు’ తొలి విజయాన్ని అందించింది. ‘అర్జున్ రెడ్డి’ అతడిని యూత్ ఐకాన్‌గా మార్చగా, ‘గీత గోవిందం’ కుటుంబ ప్రేక్షకులకూ చేరువ చేసింది. ‘మహానటి’లో అతిథి పాత్ర, ‘టాక్సీవాలా’ విజయం అతడి క్రేజ్‌ను మరింత పెంచాయి.
అయితే ‘ద్వారక’, ‘నోటా’, ‘డియర్ కామ్రేడ్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రాలు విజయాలను అందుకోలేకపోయాయి. భారీ అంచనాలతో వచ్చిన ‘లైగర్’ పాన్ ఇండియా ప్రయత్నానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
‘ఖుషి ఫ్యామిలీ స్టార్’ కూడా నిరసపరిచాయి. ‘కింగ్డమ్’తో మరోసారి తన మార్కెట్‌ను బలోపేతం చేసుకోవాలనుకున్న విజయ్‌కు ఆ చిత్రం కూడా మొండి చెయ్యి చూపింది.
చారిత్రక నేపథ్యం, భారీ నిర్మాణ విలువలు, విజయ్–రష్మిక జోడీ ‘రణబాలి’కి మంచి క్రేజ్ తెచ్చాయి. కానీ ఈ చిత్రానికి కూడా మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కథనం, స్క్రీన్‌ప్లేపై విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే తుది ఫలితాన్ని అంచనా వేయడానికి ప్రేక్షకుల ఆదరణ, వసూళ్ల నిలకడను పరిశీలించాల్సి ఉంటుంది.
అసలు సమస్య ఎక్కడ?
ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్, యువతలో క్రేజ్, విభిన్న పాత్రలు చేయాలనే తపన విజయ్ బలాలు. కానీ స్టార్డమ్కు తగ్గ విజయాలను అందించలేకపోవడం అతడి కెరీర్లో తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. భారీ ప్రచారం, భారీ బడ్జెట్, పాన్ ఇండియా లక్ష్యం.. బలహీనమైన కథలతో నెగ్గుకు రాలేవని ‘లైగర్’ వంటి చిత్రాలు నిరూపించాయి. విజయ్‌కు ఇప్పుడు కావాల్సింది తన ఇమేజ్‌కు సరిపోయే బలమైన కథ, ప్రేక్షకులను కట్టిపడేసే కథనం.
‘అర్జున్ రెడ్డి’తో స్టార్‌గా ఎదిగిన విజయ్ దేవరకొండ.. తన స్టార్‌డమ్‌ను నిలబెట్టుకునే మరో బలమైన విజయాన్ని అందుకోవాల్సిన అవసరం ఉంది!!
