ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు నూతనంగా నియమితులైన ఛైర్మన్, డైరెక్టర్స్ కు శుభాకాంక్షలు తెలిపారు టీఎఫ్ సీసీ ఛైర్మన్, నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్. ఛైర్మన్ పి.భరత్ భూషణ్, వైస్ ఛైర్మన్ చిక్కాల మెహర్ రమేష్ కుమార్, డైరెక్టర్లు చదలవాడ శ్రీనివాసరావు, సుమన్ తల్వార్, సాయిమాధవ్ బుర్రా, ఎస్. శివాజీ, శ్రీమతి వై. ఝాన్సీ, వివేక్ కూచిభొట్ల, వి. సముద్ర, మీర్.ఎస్, కందిమళ్ల సాంబశివరావు, ఏ. సత్యనారాయణ, ఎస్ వీ కృష్ణారెడ్డి, జీ. రాజ్ వెంకటేశ్వర యాదవ్, డి. సత్యనారాయణలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ అనుభవం ఉన్న పి. భరత్ భూషణ్ ఆధ్వర్యంలో సినీ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందాలని ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో
డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ఛైర్మన్ గా పి.భరత్ భూషన్ గారు నియమితులు కావడం సంతోషంగా ఉంది. ఆయన ఈ పదవికి అన్ని విధాలా అర్హులు. భరత్ భూషణ్ తెలుగు ఫిలింఛాంబర్ ప్రెసిడెంట్ గా వర్క్ చేశారు. డిస్ట్రిబ్యూషన్ రంగంలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నారు. ఆయన ఆధ్వర్యంలో సినీ పరిశ్రమ మరింతగా అభివృద్ధి చెందుతుందనే నమ్మకం ఉంది. భరత్ భూషణ్ గారు ఛైర్మన్ గా నియమితులు అయ్యాకే నంది అవార్డ్స్ రాబోతున్నాయి. ఈ కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహిస్తారని కోరుకుంటున్నా. అలాగే దాదాపు 700లకు పైగా చిత్రాల్లో నటించిన సుమన్ గారిని డైరెక్టర్ గా నియమించడం సంతోషకరం. ఆయనతో నాకు నిర్మాతగా, నటుడిగా ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. ఇండస్ట్రీలో ఎలాంటి కాంట్రవర్సీ లేని యాక్టర్ సుమన్ గారు. నేటి భారతం, సితార, తరంగిణి, బావ బావమరిది వంటి ఎన్నో సూపర్ హిట్స్ ఇండస్ట్రీకి అందించారు. మనకు వెంకటేశ్వర స్వామి అంటే సుమన్ గారే గుర్తొస్తారు. సుమన్ గారు మరిన్ని మంచి మూవీస్ చేసి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. సినీ కార్మికులకు అండగా నిలబడే గొప్ప మనసున్న నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు గారు డైరెక్టర్ గా నియమితులు కావడం సంతోషంగా ఉంది. ఆయన చిత్రపురి కాలనీ బ్యాంక్ ఆక్షన్ కు వెళ్లకుండా కాపాడారు. కోవిడ్ టైమ్ లో సినీ కార్మికులకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. నిర్మాతగా సుదీర్ఘ ప్రస్థానం సాగిస్తున్నారు. అలాగే ఎఫ్ డీసీ డైరెక్టర్ గా ఎంపికైన సాయి మాధవ్ బుర్రా పవర్ ఫుల్ సంభాషణలకు మారుపేరుగా నిలుస్తారు. నాకు మంచి మిత్రులు. అలాగే ఎఫ్ డీసీ వైస్ ఛైర్మన్ చిక్కాల మెహర్ రమేష్ కుమార్, డైరెక్టర్లు ఎస్. శివాజీ, శ్రీమతి వై. ఝాన్సీ, వివేక్ కూచిభొట్ల, వి. సముద్ర, మీర్.ఎస్, కందిమళ్ల సాంబశివరావు, ఏ. సత్యనారాయణ, ఎస్ వీ కృష్ణారెడ్డి, జీ. రాజ్ వెంకటేశ్వర యాదవ్, డి. సత్యనారాయణ…వీరందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వీళ్లంతా ఎలాంటి కాంట్రవర్సీ లేని వారు, నిజంగా ఈ పదవులకు అర్హులు. వీరి తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధిలో వీరంతా భాగస్వామ్యులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వారికి తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా పూర్తి సహకారం అందిస్తాం అన్నారు.

