HomeEntertainmentప్రచారం అవసరమైన ప్రతిసారి పాలు తాగిన రొమ్ములు గుద్దడం ఈ పడతి ప్రత్యేకత

ప్రచారం అవసరమైన ప్రతిసారి పాలు తాగిన రొమ్ములు గుద్దడం ఈ పడతి ప్రత్యేకత

- Advertisment -

16 ఏళ్ల క్రితం కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన “ఝుమ్మంది నాదం” చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది తాప్సి పొన్ను. తెలుగులో తెచ్చుకున్న గుర్తింపుతో తమిళంలోనూ సినిమాలు చేసి, ఆ తర్వాత హిందీలో ఎంట్రీ ఇచ్చి అంచెలంచెలుగా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేసే స్థాయికి ఎదిగింది. అక్కడివరకు అంతా బాగానే ఉంది. మన తెలుగు సినిమాతో అరంగేట్రం చేసిన ఓ అమ్మాయి ఈరోజు పాన్ ఇండియా హీరోయిన్ అనిపించుకుంటోoదని మనం గర్వపడుతుంటే… ఈ భామ మాత్రం తనకు ప్రచారం అవసరమైన ప్రతిసారి… మన తెలుగు సినిమా రంగం గురించి చులకనగా మాట్లాడుతుంటుంది.

గత ఏడాది తన సినిమా ప్రమోషన్ నిమిత్తం మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ తెలుగులో తన తొలి చిత్రం “ఝుమ్మంది నాదం”లో తన బొడ్డును పండ్లు, పూలతో కొట్టిస్తూ చిత్రీకరించిన పాట చేస్తున్నప్పుడు తాను చాలా అసౌకర్యానికి గురయ్యానని చెప్పుకొచ్చింది. అప్పట్లో ఇది నేషనల్ న్యూస్ కూడా అయింది. సినిమాల్లో అవసరమైతే కొన్ని సన్నివేశాల్లో సందర్భానుసారం పేడతో కూడా కొట్టించుకోవడం, బురదలో దొర్లడం మనం చాలా సినిమాల్లో చూశాం. అయినా సరే అప్పట్లో తాప్సి తనకు ఎదురైన అసౌకర్యం గురించి పంచుకున్నప్పుడు… అందరూ కొంచెం సానుభూతితో స్పందించారు.

ఇప్పుడు మళ్ళీ తన “గాంధారి” అనే చిత్రం విడుదల సందర్భంగా మరోసారి తన తొలి చిత్రం నాటి రోజుల్ని గుర్తుకు తెచ్చుకొని, తెలుగు సినిమా రంగాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేసింది తాప్సి. షూటింగ్ సందర్భంగా తనను ఒకలా… హీరోను ఒకలా చూసేవారని తాప్సి తాజాగా తీరుబడిగా వాపోయింది. ఈ సినిమాలో హీరో మంచు మనోజ్ అప్పటికే హీరోగా గుర్తింపు తెచ్చుకొని ఉండడం ఒకటైతే, ఈ చిత్రానికి నిర్మాత అతని సోదరి మంచు లక్ష్మీ ప్రసన్న కావడం ఇక్కడ గమనార్హం. అంటే ఎస్టాబ్లిష్డ్ హీరో కం ప్రొడ్యూసర్ తో సమానంగా తనను సెట్ లో ట్రీట్ చేయలేదు అన్నది ఆ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైన తాప్సి అభియోగం. తనను సెట్లో అవమానించి ఉంటే, అది అందరూ కచ్చితంగా ఖండించాల్సిన పెద్ద విషయం. కానీ తాప్సి ఆరోపణ… హీరోతో సమానంగా తనకు మర్యాదలు, సౌకర్యాలు ఇవ్వలేదని.

“ఝుమ్మంది నాదం” 2010లో విడుదలైంది. ఆ చిత్రం వేసిన పునాదిపై చక్కని భవంతి కట్టుకొని, అందులో అత్యంత సౌకర్యవంతంగా నివసిస్తున్న తాప్సీ మాత్రం…. తనకు, లేదా తన సినిమాలకు ప్రచారం అవసరమైన ప్రతిసారి తనకు జన్మనిచ్చిన తెలుగు సినిమా రంగం గురించి ఇతరులకు చులకన భావం కలిగేలా, అది కూడా వాయిదాల పద్ధతిలో మాట్లాడుతుండడం నిజంగా చాలా విచారకరం, బాధాకరం.

“ఝుమ్మంది నాదం” చిత్రం వల్ల ఎవరైనా లాభపడ్డారు అంటే… అది కేవలం తాప్సి మాత్రమే. అయినాసరే… నిజంగానే అప్పట్లో ఆమెకు ఏవైనా “చేదు అనుభవాలు” ఎదురై ఉంటే… వాటిని బోల్డ్ గా బయటపెట్టడంలో తప్పులేదు. కానీ ప్రచారంలో భాగంగా… ఎవరూ సమర్ధించలేని విషయాలు మాట్లాడుతూ తాప్సీ తన వ్యక్తిత్వాన్ని దారుణంగా దిగజార్చుకుంటోంది. ఒక పాట ఎలా తీయాలన్నది… దర్శకుడి ఆలోచనకు సంబంధించినది. ఇష్టం లేకపోతే అప్పుడే చేయనని చెప్పాలి.
ఇక ఒక కొత్త హీరోయిన్ కు… రాచ మర్యాదలు ఏ భాషలో చేస్తారో తాప్సి చెప్పి తీరాలి!!

-ధీరజ అప్పాజీ

- Advertisment -
RELATED ARTICLES

Most Popular

Recent Comments