ఇండియన్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, హాలీవుడ్ సైన్స్-ఫిక్షన్ చిత్రం ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ ప్రమోషన్స్ కోసం హాలీవుడ్ దర్శకనిర్మాతలతో చేతులు కలిపారు. భారతీయ ప్రేక్షకులకు ఈ సినిమాను చేరువ చేయడానికి హృతిక్ ఒక క్రేజీ క్రాసోవర్ వీడియోతో ముందుకు వచ్చారు.
“జాదూ వర్సెస్ రాకీ” అంటూ ఒక ప్రత్యేక వీడియోలో హృతిక్ రోషన్ తన సూపర్ హిట్ సాంగ్ ‘ఏక్ పల్ కా జీనా’ ఐకానిక్ స్టెప్‌ను ఈ హాలీవుడ్ చిత్రంలోని ఏలియన్ క్యారెక్టర్ ‘రాకీ’కి నేర్పిస్తున్నట్లు చూపించారు. హృతిక్, రాకీల మధ్య ఉన్న స్నేహాన్ని చూసి, ‘కోయీ.. మిల్ గయా’లోని హృతిక్ పాత ఏలియన్ స్నేహితుడు ‘జాదూ’ క్యూట్‌గా రియాక్ట్ అవ్వడం ఈ వీడియోలో ప్రధాన ఆకర్షణ.
హాలీవుడ్ స్టార్ హీరో ర్యాన్ గోస్లింగ్ నటించిన ఈ చిత్రం, ‘ది మార్షియన్’ ఫేమ్ ఆండీ వీర్ రాసిన బెస్ట్ సెల్లింగ్ నవల ఆధారంగా తెరకెక్కింది. డిసెంబర్ 2025లో ఈ నవలపై తనకున్న ఇష్టాన్ని హృతిక్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇప్పుడు అదే సినిమాను ఇండియాలో ప్రమోట్ చేస్తుండటం విశేషం. హృతిక్ లాంటి స్టార్ తమ సినిమాను ప్రమోట్ చేయడం పట్ల సోనీ పిక్చర్స్ ఇండియా ప్రతినిధి షోనీ పంజీకరణ్ ఆనందం వ్యక్తం చేశారు.
ఫిల్ లార్డ్ మరియు క్రిస్టోఫర్ మిల్లర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ర్యాన్ గోస్లింగ్, సాండ్రా హుల్లర్, కెన్ లెయుంగ్ తదితరులు కీలకపాత్రల పోషించారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మరియు తమిళం భాషల్లో ఐమాక్స్ ఫార్మాట్లో ఈ చిత్రం భారత దేశంలో 2026 మార్చ్ 26న విడుదల కానుంది.

