(ధీరజ అప్పాజీ)
ఒక హీరో కెరీర్ లో కొన్ని సినిమాలు హిట్టవుతాయి… కొన్ని ఫ్లాప్ అవుతాయి. కానీ చాలా అరుదుగా మాత్రమే కొన్ని సినిమాలు “ఇప్పుడు నేను ఎవరో నిరూపించుకోవాలి” అనే పరిస్థితిలో వస్తాయి. రామ్ చరణ్ కు ఇప్పుడు అలాంటి సినిమా “పెద్ది” అనిపిస్తోంది. RRR తర్వాత చరణ్ రేంజ్ ఒక్కసారిగా ప్రపంచ స్థాయికి వెళ్లిపోయింది. రాజమౌళి తెరకెక్కించిన ఆ చిత్రం వల్ల చరణ్ పేరు హాలీవుడ్ వరకు వినిపించింది.
ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు పాత్రలో అతను చూపించిన నటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. అదే సమయంలో… “ఇక నుంచి చరణ్ చేసే ప్రతి సినిమా RRR రేంజ్ లోనే ఉండాలి” అనే అంచనాలు కూడా పెరిగిపోయాయి.
అలాంటి సమయంలో వచ్చిన “ఆచార్య, గేమ్ ఛేంజర్” ప్రేక్షకులు ఊహించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. ఈ సినిమాల గురించి ఎవరికి వారు వేర్వేరు అభిప్రాయాలు చెప్పినా… ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపించింది. అభిమానులు ఇప్పుడు చరణ్ నుంచి కేవలం స్టైలిష్ ఎంటర్టైనర్ కాదు… గుండెల్లో మిగిలిపోయే బలమైన కథ కోరుకుంటున్నారు. అక్కడే “పెద్ది” మీద ఆసక్తి పెరిగింది.
సానా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ లుక్ చూసినప్పటి నుంచి… ఇది పూర్తి స్థాయి “మాస్ మట్టి వాసన” ఉన్న సినిమా అని అర్థమవుతోంది. గుబురు గడ్డం, రఫ్ లుక్, కళ్లలో ఆవేశం… ఇవన్నీ చూస్తుంటే “రంగస్థలం” రోజుల చరణ్ గుర్తుకొస్తున్నాడు.
నిజం చెప్పాలంటే… చరణ్ కెరీర్ ను నటుడిగా మరో మెట్టెక్కించిన సినిమా “రంగస్థలం”. ఇప్పుడు “పెద్ది” విషయంలో కూడా అలాంటి ఫీలింగ్ చాలామందిలో కనిపిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం, ఎమోషన్స్, క్రీడా అంశాలు కలిసిన కథ కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఈ సినిమాలో చరణ్ పూర్తిగా పాత్రలో లీనమైపోయినట్టు కనిపిస్తున్నాడు. “స్టార్ ఇమేజ్” పెద్దు“పాత్ర” డామినేట్ చేసేస్తోంది. అలాంటి సినిమాలే ఎక్కువకాలం గుర్తుండిపోతాయి. A.R. రెహమాన్ సంగీతం కూడా “పెద్ది”కి పెద్ద ప్లస్ అవుతుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది.
ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్ చూస్తే… దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాను హృదయాలకు హత్తుకునేలా తెరకెక్కిస్తున్నట్టు అనిపిస్తోంది. ఇప్పుడు “పెద్ది” కేవలం మరో రిలీజ్ కాదు. రామ్ చరణ్ విమర్శకులు ఇది ఒక సమాధానం కావచ్చు. “RRR తర్వాత కూడా నేను బలమైన కథలనే నమ్ముతున్నాను” అని రామ్ చరణ్ చెప్పే సమాధానం కావచ్చు.
జూన్ 4న సినిమా విడుదలయ్యాక ఫలితం ఎలా ఉన్నా… ఒక విషయం మాత్రం నిజం. ఈసారి ప్రేక్షకులు థియేటర్ కు వెళ్తోంది కేవలం స్టార్ చరణ్ ను చూడటానికి కాదు… నటుడు రామ్ చరణ్ ను మళ్లీ అనుభవించడానికి.

