ఈ పుట్టినరోజు నాకు చాలా ప్రత్యేకం
నిర్మాతగా డబుల్ సెంచరీ
సాధించడం నా జీవితాశయం
-వరల్డ్ రికార్డ్ హోల్డింగ్ ప్రొడ్యూసర్
తుమ్మలపల్లి రామసత్యనారాయణ
అత్యధిక భాషల్లో సినిమాలు నిర్మించిన వ్యక్తిగా డా: డి.రామానాయుడు చరిత్రకెక్కితే… ఒకేరోజు 15 చిత్రాలు ప్రారంభించిన నిర్మాతగా ప్రపంచ రికార్డు సాధించారు భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. అంతేకాదు ఈ 15 సినిమాలు ఏడాది వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే స్థిర సంకల్పంతో ముందుకు సాగుతున్న ఈ శతాధిక చిత్ర నిర్మాత తన పుట్టిన రోజు (సెప్టెంబర్ 10) సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు!!
తన వల్ల తెలుగు సినిమాకి ఓ గొప్ప గౌరవం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నానని తుమ్మలపల్లి పేర్కొన్నారు. అయితే ఈ ఘనత తన ఒక్కడిదే కాదని, తన వెన్నంటి ఉన్న వందలాది మందికి కూడా చెందుతుందని తెలిపారు. 15 సినిమాల్లో “యండమూరి కధలు, కె.పి.హెచ్.బి. కాలనీలో, మా నాన్న హీర, మహానాగ” చిత్రాల రెగ్యులర్ షూటింగ్ మొదలైందని, మిగతా చిత్రాలు ప్రి-ప్రొడక్షన్ జరుపుకుంటున్నాయని రామసత్యనారాయణ వివరించారు. ఇదే ఏడాదిలో ఒక ప్రముఖ దర్శకుడితో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించేందుకు సైతం సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పిన ఈ బహుముఖ ప్రతిభాశాలి… ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జరుపుకుంటున్న ఈ పుట్టినరోజు తనకు చాలా ప్రత్యేకమని పేర్కొన్నారు!!
తొలినాళ్లలో పలు చేదు అనుభవాలు ఎదుర్కొన్న తనకు… ఇండస్ట్రీ ఇంత మంచి స్థానాన్ని, స్థాయిని ఇస్తుందని కలలో కూడా ఊహించలేదని, ఇందుకు తన కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉందని వెల్లడిస్తూ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. నిర్మాతగా 200 చిత్రాలు పూర్తి చేయాలన్నదే తన జీవితాశయమని ఈ సందర్భంగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ ప్రకటించారు!!