HomeEntertainment‘ఆది రుద్రాక్ష’ మూవీ గ్లిమ్స్ విడుదల

‘ఆది రుద్రాక్ష’ మూవీ గ్లిమ్స్ విడుదల

- Advertisment -

▪️ పంచమహాశక్తుల నేపథ్యంలో పౌరాణిక యాక్షన్ థ్రిల్లర్‌

హైదరాబాద్: పంచమహాశక్తులు, మహారహస్యం, దుష్టశక్తుల మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో తెరకెక్కుతున్న పౌరాణిక యాక్షన్ థ్రిల్లర్ ‘ఆది రుద్రాక్ష’. షేక్ మహబూబ్ బాషా నిర్మాణంలో, ఆర్యన్ హీరోగా నటిస్తూ రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తొలి గ్లిమ్స్‌ను హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో విడుదల చేశారు.

సినిమా గ్లిమ్స్‌లో వినిపించిన వాయిస్ ఓవర్ ఆసక్తికరంగా సాగింది. నాగ, గజ, వ్యాఘ్ర, మయూర తదితర శక్తుల ప్రస్తావనతో పాటు, యుగయుగాలుగా ఓ మహారహస్యానికి రక్షణగా నిలిచిన పంచరక్షకుల కథను పరిచయం చేశారు. ఆ రహస్యాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నించే దుష్టశక్తులు, వాటిని ఎదుర్కొనే మహావీరుడి నేపథ్యంలో కథ సాగనున్నట్లు గ్లిమ్స్ ద్వారా వెల్లడించారు. మహాదేవుని సంకల్పానికి ప్రతిరూపంగా ఓ వీరుడు రణరంగంలోకి అడుగుపెట్టే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా హీరో, దర్శకుడు ఆర్యన్ మాట్లాడుతూ.. కార్తీక పౌర్ణమి పర్వదినం రోజున తమ సినిమా గ్లిమ్స్ విడుదల కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తాను ఎంతో ఇష్టపడి రాసుకున్న కథను వెండితెరపైకి తీసుకొస్తుండటం సంతోషాన్నిస్తోందని చెప్పారు. సినిమా గ్లిమ్స్‌ను ప్రముఖ నటుడు విజయ్ ఆంటోని గారు వీక్షించి, అభినందించడం తమ చిత్రబృందానికి మరింత ఉత్సాహాన్నిచ్చిందని తెలిపారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేలా సినిమాను రూపొంస్తామని పేర్కొన్నారు.

నిర్మాత షేక్ మహబూబ్ బాషా మాట్లాడుతూ.. ‘ఆది రుద్రాక్ష’ చిత్రానికి అండగా నిలుస్తూ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు ఆర్యన్ అద్భుతమైన కథను సిద్ధం చేశారని, కథపై ఆయనకున్న స్పష్టత, అంకితభావం తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. చిత్రాన్ని మంచి నాణ్యతతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి అందరం సమష్టిగా కృషి చేస్తున్నామని అన్నారు.

హీరోయిన్ రూప మాట్లాడుతూ.. ఆర్యన్ చెప్పిన కథ తనకు ఎంతో నచ్చిందని, ఇందులో భాగమయ్యే అవకాశం కల్పించినందుకు దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. మంచి కథతో రూపొందుతున్న ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

చిత్ర యూనిట్ సభ్యులు నవీన్, సందీప్, శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘ఆది రుద్రాక్ష’ కథాంశం ఎంతో ఆసక్తికరంగా, ప్రత్యేకంగా ఉందని అన్నారు. దర్శకుడు ఆర్యన్ ఆలోచనను తెరపై అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారని తెలిపారు. చిత్రబృందంలోని ప్రతి ఒక్కరి సహకారంతో, పరమశివుడి ఆశీస్సులతో ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు.

ఆర్యన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో పౌరాణిక అంశాలు, మహాశక్తులు, యాక్షన్ సన్నివేశాల మేళవింపుతో కథను రూపొందిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తొలి గ్లిమ్స్‌తోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.

సాంకేతిక బృందం: ఆర్యన్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం రుద్ర సాయి, సంగీతం అభిషేక్ రూఫస్ అందిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యతలను డాక్టర్ హవ్రన్.ఎ నిర్వహిస్తున్నారు. బొను రూపా సహకారం అందిస్తున్నారు. కళ్యాణ్ సముద్రాల స్టిల్స్ అందించగా, సందీప్ కుందుర్తి ప్రచార చిత్రాల రూపకల్పన చేపట్టారు. పీఆర్ఓగా రమేష్ గోపిశెట్టి వ్యవహరిస్తున్నారు.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments