విడుదలకు సిద్ధమవుతున్న
ఏఐ ఆధారిత పాన్ ఇండియా ఫిలిం!
2003లో “తొలి పరిచయం” చిత్రంతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన “కిరణ్ కర్నీడి” 23 ఏళ్ల విరమానంతరం “స్ట్రైకర్” చిత్రంతో తన సత్తాను చాటుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. నవంబర్ 25 తన పుట్టినరోజును పురస్కరించుకొని “ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ”తో తను రూపొందించిన పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్ “స్ట్రైకర్” చిత్రానికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడించారు. యూనివర్సల్ మూవీస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో కిరణ్ కర్నీడి ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు!!
విద్యాధికుడైన కిరణ్ కర్నీడి “గ్లామర్ టాప్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్” సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ గా సేవలందించారు. ‘తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్” మరియు ‘తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్’లో శాశ్వత సభ్యుడైన కిరణ్ కర్నీడి… మార్కెటింగ్ లో తనకు గల అపార అనుభవానికి- తనలోని సృజనాత్మకతను, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి “స్ట్రైకర్” చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు!
నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “స్ట్రైకర్” చిత్రం థియేటర్ రిలీజ్ కు అవసరమైన సాంకేతిక సన్నాహాలు చేసుకుంటోంది. సంప్రదాయ కమర్షియల్ సినిమా విలువలు కొనసాగిస్తూనే అద్భుత సాంకేతిక మాయాజాలంతో సినిమా నిర్మాణాన్ని కొత్త పుంతలు తొక్కించడం, ఈ రంగంలో కొత్త బాటలు వేయడం ఈ చిత్రం ప్రధాన ఉద్దేశం అని “స్ట్రైకర్” సృష్టికర్త కిరణ్ కర్నీడి చెబుతున్నారు.
శక్తివంతమైన సాంకేతికతకు- బలీయమైన భావోద్వేగాలు, పుష్కలమైన వినోదం మేళవించి అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని “స్ట్రైకర్” చిత్రం అందిస్తుందని కిరణ్ కర్నీడి ఘంటాపథంగా చెబుతున్నారు. తెలుగు సినిమా రంగంలో సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టనున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్ – అప్పాజీ, ఎడిటర్ & ఎ. ఐ. క్రియేటర్: శ్రీనాధ్ మాచర్ల, మ్యూజిక్; మ్యాజిక్ మష్రూమ్స్, బిజీఎం: శాలిని మిశ్రా, నిర్మాణం – దర్శకత్వం: కిరణ్ కర్ణీడి!!

