
ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్
చార్మింగ్ స్టార్ శర్వా పూర్తిగా రస్టిక్ అవతార్‌లో కనిపించనున్న ఇంటెన్స్ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తుండగా, లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. నవంబర్ 27న ‘భోగి’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి అన్ని పాటలు రాసిన లిరిక్ రైటర్ చంద్రబోస్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు.
-‘మల్లేశం’, ‘ఛాంపియన్’ సినిమాల్లో తెలంగాణ మాండలికంలో పాటలు రాశాను. కాకపోతే ‘భోగి’లో అత్యంత సహజమైన తెలంగాణ మాండలికంలో రాశాను. నేను చిన్నప్పుడు విన్నవి, మాట్లాడుకున్నవి, పరిశీలించిన మాటలను కూడా ఈ సినిమా ద్వారా రాసే అవకాశం వచ్చింది. ఇది నాకు చాలా ఆనందాన్నిచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేశాను.
-‘భోగి” తెలంగాణ పల్లెటూరి బతుకు చిత్రం. ఆ జీవితాన్ని అత్యంత స్వచ్ఛమైన మాటల్లో, ఆ పరిభాష, యాసలో రాసే పనిలో సఫలమయ్యామని భావిస్తున్నాం. ప్రేక్షకుల ఆదరణ చూస్తుంటే బోలెడంత సంతోషంగా ఉంది.
-సినిమా కవి ప్రతి మాండలికంలోనూ ఒదిగిపోవాలి. ‘రంగస్థలం’ సినిమాలో సుకుమార్ గారితో కలిసి గోదావరి మాండలికంలో పాటలు రాశాను. అలాగే ‘పుష్ప’లో చిత్తూరు యాస పరిశీలించి రాయడం జరిగింది. ‘భోగి’ సినిమాకు వచ్చేసరికి ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు, నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి కళ్ళు మూసుని, నా మూలాల్లోకి వెళ్లి, ఆ మూలాల్లో ఉన్న తడిని ఇంకుగా చేసుకుని పాటలు రాశాను. నేను 13 ఏళ్ల వయసులో మా ఊరి నుంచి హైదరాబాద్ వచ్చేశాను. కాకపోతే ఆ 13 ఏళ్లలో నేను నేర్చుకున్న భాష, ఆ పరిసరాలు, మాండలికం.. అవన్నీ ఇంకా నా లోపల ఉన్నాయి. వ్యక్తిగతంగా నాకు చాలా సంతృప్తినిచ్చిన పాటలు ఇవి. మాతృ మాండలికంలో పాటలు రాసే అవకాశం రావడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.
