HomeEntertainmentరఫ్ఫాడిస్తున్న రావిపూడి

రఫ్ఫాడిస్తున్న రావిపూడి

- Advertisment -

సినిమా ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాడు

సినిమా తీయడం ఒక ఎత్తయితే… దాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. అందులోనూ నేటి డిజిటల్ యుగంలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం అంత సులభమైన విషయం కాదు. అయితే ఈ విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. సినిమా షూటింగ్ ప్రారంభం నుంచి విడుదల వరకు ఏదో ఒక కొత్త ఆలోచనతో ప్రేక్షకుల్లో చర్చకు తెరలేపుతున్నాడు.

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కోసం అనిల్ రావిపూడి అనుసరించిన ప్రచార వ్యూహం ఇందుకు మంచి ఉదాహరణ. విక్టరీ వెంకటేష్‌ను ప్రమోషనల్ రీల్స్‌లో భాగస్వామిని చేయడం, పాటలు, సరదా వీడియోలతో సోషల్ మీడియాలో సందడి చేయడం సినిమాకు మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. ప్రేక్షకులతో పాటు కుటుంబ ప్రేక్షకుల్లోనూ సినిమా పట్ల ఆసక్తిని పెంచడంలో ఈ ప్రచారం కీలక పాత్ర పోషించింది.

ఇక మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ విషయంలోనూ అనిల్ తన మార్క్‌ను చూపించాడు. చిరంజీవి కెరీర్‌లోని ఐకానిక్ పాత్రలను గుర్తుచేస్తూ ఏఐ సాంకేతికతతో రూపొందించిన ప్రత్యేక వీడియో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఒకవైపు మెగాస్టార్ అభిమానుల్లో నాస్టాల్జియాను రేకెత్తిస్తూనే మరోవైపు కొత్త తరానికి ఆసక్తి కలిగించేలా ఆ వీడియోను రూపొందించడం విశేషం.

ఇప్పుడు వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్‌లతో చేస్తున్న మల్టీస్టారర్ ‘జనవరి 12 విడుదల’ విషయంలోనూ అదే దూకుడు కనిపిస్తోంది. సినిమా ప్రారంభానికి ముందే ప్రచారాన్ని మొదలుపెట్టిన అనిల్, సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ పరిచయం కోసం జంధ్యాల శైలిలో వినోదాత్మక వీడియోను రూపొందించాడు. తాజాగా రజనీకాంత్ నటించిన ‘దళపతి’లోని ఐకానిక్ సన్నివేశాన్ని కృతి శెట్టితో కలిసి సరదాగా రీక్రియేట్ చేస్తూ మ్యూజికల్ ప్రమోషన్స్‌కు తెరతీశాడు.

సినిమా విడుదలకు ముందు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడం ఒక కళ అయితే… సినిమా ప్రమోషన్‌నే ఒక వినోదంగా మార్చడం మరో కళ. ఈ రెండింటినీ సమర్థంగా మేళవిస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన ప్రమోషనల్ బ్రాండ్‌ను సృష్టించుకుంటున్నాడు అనిల్ రావిపూడి.

అందుకే ఇప్పుడు ఆయన సినిమా అప్‌డేట్ వచ్చినా… ప్రమోషనల్ వీడియో విడుదలైనా సోషల్ మీడియాలో ప్రత్యేకమైన సందడి కనిపిస్తోంది. దర్శకుడిగా మాత్రమే కాదు… సినిమా మార్కెటింగ్‌లోనూ తనదైన ముద్ర వేస్తున్న ఈ వినోదాల దర్శకుడి నుంచి రాబోయే రోజుల్లో ఇంకెన్ని కొత్త ప్రయోగాలు చూడబోతున్నామో!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments