HomeEntertainmentచెరగని సంతకం సెలవు తీసుకుంది

చెరగని సంతకం సెలవు తీసుకుంది

- Advertisment -

భారతీయ సినిమా గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరైన సింగీతం శ్రీనివాసరావు కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబర్ 3న తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 95 సంవత్సరాలు.
ఆరు దశాబ్దాలకు పైగా సాగిన సుదీర్ఘ సినీ ప్రయాణంలో సింగీతం శ్రీనివాసరావు తనదైన ప్రయోగాలతో భారతీయ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కథ ఏదైనా… జానర్ ఎలాంటిదైనా… దాన్ని కొత్తగా చెప్పాలనే తపన ఆయన ప్రతి సినిమాలోనూ కనిపించేది.
కె.వి.రెడ్డి వద్ద శిష్యరికం చేసిన సింగీతం… ‘మాయాబజార్’ వంటి అద్భుత చిత్రాల నిర్మాణ ప్రక్రియను దగ్గరగా చూసి సినిమా భాషను నేర్చుకున్నారు. 1972లో ‘నీతి నిజాయితీ’తో దర్శకుడిగా పరిచయమైన ఆయన, ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విభిన్న చిత్రాలకు దర్శకత్వం వహించారు.
‘మయూరి’, ‘పుష్పక విమానం’, ‘ఆదిత్య 369’, ‘భైరవ ద్వీపం’, ‘మైఖేల్ మదన కామరాజు’, ‘అపూర్వ సహోదరులు’ వంటి చిత్రాలు ఆయన సృజనాత్మకతకు నిలువెత్తు నిదర్శనాలు.
మాటలు లేకుండానే కథను చెప్పిన ‘పుష్పక విమానం’… తెలుగు తెరపై టైమ్ ట్రావెల్ ఆలోచనను అద్భుతంగా ఆవిష్కరించిన ‘ఆదిత్య 369’… జానపద, ఫాంటసీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన ‘భైరవ ద్వీపం’… ఇలా సింగీతం పేరు వినగానే ప్రయోగం, వైవిధ్యం, సృజనాత్మకత గుర్తుకు వస్తాయి.
కమల్ హాసన్‌తో ఆయన చేసిన చిత్రాలు కూడా భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచాయి. ‘పుష్పక విమానం’, ‘అపూర్వ సహోదరులు’, ‘మైఖేల్ మదన కామరాజు’ వంటి చిత్రాలు ఆయన దర్శకత్వ ప్రతిభకు మరో కోణాన్ని చూపించాయి.
విశేషమేమిటంటే… తొంభైల్లోకి అడుగుపెట్టిన తర్వాత కూడా సినిమా పట్ల ఆయన ఉత్సాహం తగ్గలేదు. 2026లో విడుదలైన ‘సింగ్ గీతం’ ఆయన దర్శకత్వంలో వచ్చిన 61వ చిత్రం. చివరి దశలోనూ సినిమా చేయాలనే తపనను ఆయన కొనసాగించారు.
రెండు జాతీయ అవార్డులు సహా పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్న సింగీతం… తన సినిమాలతో తరతరాల ప్రేక్షకులను అలరించారు!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments