ఆదిత్య హాసన్
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ’90s’ వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న యువ దర్శకుడు ఆదిత్య హాసన్, ఈ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతుండటం విశేషం. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. యువతలో భారీ అంచనాలను ఏర్పరచుకున్న ‘ఎపిక్’ చిత్రం, సెప్టెంబర్ 11న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో చిత్ర దర్శకుడు ఆదిత్య హాసన్, పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
- మాది వనపర్తి. టెన్త్ వరకు అక్కడే చదువుకున్నాను. మా నాన్న స్కూల్ టీచర్ గా రిటైర్ అయ్యారు. అమ్మ హౌస్ వైఫ్. అన్న, వదిన బ్యాంక్ ఉద్యోగం చేస్తున్నారు. టెన్త్ తర్వాత నాకు సినిమాపై ఆసక్తి పెరిగింది. ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయలేదు. హైదరాబాద్ లో డిగ్రీ చదివి, ఆ తర్వాత మాస్టర్స్ కోసం యూకే వెళ్ళాను. అప్పటికే షార్ట్ ఫిలిమ్స్ చేసిన నేను, యూకే నుంచి తిరిగి వచ్చిన తర్వాత సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఆరు నెలల తర్వాత కలర్స్ స్వాతి గారితో ‘టీచర్’ అనే సినిమా చేశాను. నవీన్ మేడారం గారు, అభిషేక్ నామా గారు నిర్మించిన ఆ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. యూకేలో నేను చదువుకున్న యూనివర్సిటీలో నవీన్ గారు సీనియర్. సినిమాల పట్ల ఆసక్తితో ఆయనను సంప్రదించి, పరిచయం చేసుకున్నాను.
- నా అసలు పేరు ఆదిత్య. నేను కమల్ హాసన్ గారి వీరాభిమానిని. ఆ అభిమానంతోనే నా పేరును ఆదిత్య హాసన్ గా మార్చుకున్నాను.
- ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. మన నిజ జీవితంలోని కొన్ని కొన్ని అందమైన సంఘటనల ఆధారంగా కథ ఉంటుంది. 90s సిరీస్ కు ఇది సీక్వెల్. అందులోని తమ్ముడి పాత్రకు సంబంధించిన జీవితంలోని ఒక భాగం ఎపిక్ కథగా ఉంటుంది. ఆ తర్వాత అన్న జీవితాన్ని ఒక కథగా, అక్క జీవితాన్ని ఒక కథగా చూపించే ఆలోచన ఉంది.

