HomeEntertainmentఅజేయంగా సాగుతున్న అంకారావు జీవితం!!

అజేయంగా సాగుతున్న అంకారావు జీవితం!!

- Advertisment -

కేతినేని అజయ్‌ కుమార్‌ అసలు పేరు కె. అంకారావు, కేతినేని కోటయ్య, అంజమ్మలకు మార్చి 1, 1954 లో జన్మించారు. ఆయనకు ఒక అన్న… ప్రసాదరావు, తమ్ముడు…. రామారావు ఉన్నారు. అన్న ప్రసాదరావు అమ్మమ్మ ఇంటికి దత్తత వెళ్లాడు. గుంటూరు జిల్లా, వినుకొండ తాలూకాలోని ‘పెదకొండపాళెం” వీరి సొంత ఊరు.అమ్మమ్మగారి ఊరైన ‘సంతమావులూరు”లో పదవ తరగతి వరకు చదువు కున్నారు. తరువాత మెట్రిక్‌ లేషన్‌ నరసరావుపేటలో పూర్తి చేశారు.


డిగ్రీ గుంటూరు “జాగర్ల మూడి కుప్పుస్వామి” కాలేజీలో చదువుకున్నారు.డిగ్రీ తరువాత యస్‌.ఐ ఉద్యోగం కోసం అప్పటి రాష్ట్ర మంత్రి చేబ్రోలు హనుమయ్య ద్వారా ప్రయత్నాలు చేశారు.అవి ఫలించలేదు.చిన్నతనం నుండే స్కూల్‌ లో కాలేజీలో నాటకాలు రాయడం, డైరక్షన్‌ చేయడం, నటించడం ఇష్టం ఉండటంతో
నరసరావుపేటలో మెట్రిక్‌ చదువుతున్న సమయంలో ఆ ఊర్లో ఉన్న సత్యనారాయణ టాకీస్‌కు వెళ్ళి సినిమాలు చూడటమే కాకుండా సినిమా ఆపరేటింగ్‌ నేర్చుకుని సినిమాలు ఆపరేట్‌ చేసేవారు.. తద్వారా ఒక్కో సినిమాను లెక్కలేనన్నిసార్లు చూసేవారు. ఆ థియేటర్ లో ఆపరేటర్ గా పని చేస్తున్న వ్యక్తికి సినిమా
పరిశ్రమలో జెమెనీ స్టూడియోలో సౌండ్‌ ఇంజనీరు గా పని చేసే కోటేశ్వరరావు బంధువు కావడంతో ఆయనను పరిచయం చేయమని ఆ ఆపరేటర్‌ ను కాకా పట్టే వాడు. అదే సమయంలో…. ఆ థియేటర్‌ కు సినిమా చూడటానికి వచ్చిన అజయ్ కుమార్ బందువులు కొందరు .. “ఎప్పుడు వెళ్లినా మీ
వాడు థియేటర్‌ దగ్గరే ఉంటున్నాడు” అని అజయ్ కుమార్‌ నాన్నకు సమాచారం చేరవేయడంతో.. వాళ్ళ నాన్న వచ్చి తన కొడుకు చేస్తున్న పని చూసి…. బలవంతంగా లాక్కెల్లి పోయారు!!

గుంటూరులో వాళ్ల బంధువు కోటేశ్వరరావు అనే వ్యక్తి లెక్చరర్ గా చేస్తూ ఉంటే.. ఆయనను కాపలా పెట్టి చదివించారు. డిగ్రీ తరువాత “నా మిత్రలు మద్రాసులో చార్టడ్‌ అకౌంటెంట్‌ కోర్సు చదువుకుంటున్నారు. నేను కూడా వెళతాను” అని ఇంట్లో వాళ్ళ పర్మిషన్‌ తీసుకుని మద్రాసులో సిఏ కోర్సు చదవ డానికి వెళ్లాడు. పైకి సిఏ చదువు అని చెప్పినా ఎలాగైనా సినిమాల్లోకి వెళ్లాలి అని మనసులో అనుకుని ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుండేవారు!!

తాను సిఏ చేస్తున్న చోట సినిమావాళ్ళకు ఆడిటింగ్‌ చేసే రామ్మోహన్‌ రావు అనే ఆడిటర్‌ పరిచయం అయ్యారు. ఆయన కె.రాఘవేంద్రరావు అకౌంట్స్ ఆడిటింగ్‌ చేస్తుండేవారు. ఆయన రెకమెండేషన్ తో కె.రాఘవేంద్రరావు వద్ద (అప్రంటీస్‌) సహాయ దర్శకుడిగా ‘నిప్పులాంటి నిజం” అనే సినిమాకు చేరారు.
ఆ సినిమా పూర్తైన తరువాత వి.మధుసూధన రావు వద్ద దర్శకత్వ శాఖలో చేరి శోభన్‌ బాబు కథానాయకుడిగా రూపొందిన “మిస్టర్‌ విజయ్‌, జేబు దొంగ, జీవిత చక్రం” సినిమాలకు పని చేశారు. ఆ తరువాత కో డైరెక్టర్‌ గా వి. మధుసూధన రావు వద్ద పని చేసిన కోదండ రామిరెడ్డి “సంధ్య” అనే సినిమా ద్వారా దర్శకుడిగా పరిపచయం అయ్యారు. దాని తరువాత ఆయన వద్ద అసోసియేట్‌ దర్శకుడిగా “అభిలాష, ఛాలెంజ్‌, రాక్షసుడు” అలా వరసగా పది సినిమాలు చేశారు.


దాని తరువాత కె.యస్‌. రామారావు క్రియేటివ్‌ కమర్షియల్‌ బ్యానర్‌ లో పలు సినిమాలకు పని చేస్తున్న సమయంలో అజయ్ కుమార్‌ లోని టాలెంట్‌ను గమనించిన నిర్మాత కె.యస్. రామారావు అజయ్‌ కుమార్‌ను “కొంగుచాటు కృష్ణుడు” ద్వారా దర్శకుడిని చేశారు. ఆ సినిమా బాగా ఆడటంతో వెంటనే “మాతృదేవోభవ” సినిమా ఇచ్చారు. మలయాళం లో రూపొందిన “ఆకాశదూతు” సినిమా ఆధారంగా రూపొందిన ఈ సినిమాను నిర్మాత కె. ఎస్. రామారావు చూసి తెలుగులో
పునర్నిర్మాణానికి హక్కులు కొన్నారు. ఆ సినిమా కథను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చుకున్నారు. ఆ సినిమా మలయాళంలో కంటే తెలుగులో సంచలన విజయాన్ని సాధించింది. అంతే కాకుండా ఈ సినిమాలో “రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే” అనే పాటను రాసిన వేటూరి సుందర రామ్మూర్తికి జాతీయ
పురస్కారం లభించింది!!

దాని తరువాత “జీవిత ఖైదీ, అల్లరోడు, వద్దుబావా తప్పు, కుటుంబ గౌరవం, సింహగర్జన, మమ్మీ మీ ఆయన వచ్చాడు. ప్రేమించాను నిన్నే, రౌడీ షీటర్‌, నీతో వస్తా” సినిమాలతోపాటు హిందీలో మనిషాకొయిరాల ప్రధాన ప్రాతలో “తులసి” అనే సినిమాకు దర్శకత్వం వహించారు.

చదలవాడ శ్రీనివాసరావు నిర్మించిన “ప్రేమించాను నిన్నే” సినిమా చూడటానికి అప్పటి కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు, రామోజీ ఫిలింసిటీ అధినేత.. ఈనాడు గ్రూప్స్ ఛైర్మన్‌ రామోజీరావు హైదరాబాద్‌ ఆర్‌టిసి క్రాస్‌ రోడ్స్ లోని సుదర్శన్‌ థియేటర్‌ కు వచ్చి సినిమా తొలి ఆటను చూశారు.

చదలవాడ శ్రీనివాసరావు ఆద్వర్యంలో ఏర్పాటైన తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్‌ సంయుక్త కమెటీకి అజయ్‌ కుమార్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ కమెటీ ఆద్వర్యంలో మంచి కథ దొరికితే రొటేషన్‌ పద్దతిలో కథ డిమాండ్‌ ను బట్టి బడ్జెట్‌ లిమిట్‌ లేకుండా సినిమాలు తీస్తారు. కథల ఎంపిక విషయంలో ప్రత్యేక
మైన కమెటీ ఉంటుంది. ప్రపంచ చరిత్రలోనే ఇలాంటి ప్రయత్నం ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. సినిమాల్లోకి రాకముందు నుండి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేని కుటుంబం కాబట్టి ఆయన సినిమా కష్టాలేవి చవి చూడలేదు. కె. అజయ్‌ కుమార్‌ ధర్మపత్ని పేరు సుజాత. వారికి ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి
భర్త వెటనరీ డాక్టర్‌ కాగా… రెండవ అమ్మాయి భర్త సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్. పిల్లలిద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments