HomeEntertainment"గోదావరి గట్టుపైన"… గట్టెక్కినట్టేనా!?

“గోదావరి గట్టుపైన”… గట్టెక్కినట్టేనా!?

- Advertisment -

(ధీరజ అప్పాజీ)

“ఓ సగటు గోదారోడిగా “గోదారి గట్టుపైన” సినిమా టైటిల్ అనౌన్స్ అయినప్పుడే ఈ సినిమా చూసి తీరాలని నేను ఫిక్సయిపోయాను. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు అటెండ్ అయిన తర్వాత ఈ సినిమా కచ్చితంగా మంచి విజయం సాధించే అవకాశముందని నాకనిపించింది. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత ఒక “క్లీన్ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌”గా నిలుస్తుందనే ఫీలింగ్ కలిగింది!!

అందుకే ఎప్పుడో కానీ “సతీసమేతంగా” మీడియా షోలకు హాజరయ్యే అలవాటు లేని నేను, నా అర్థాంగిని వెంటబెట్టుకుని మరీ అమీర్‌పేటలోని అల్లు అర్జున్ థియేటర్‌లో ఈ చిత్రాన్ని చూశాను!!

ముందుగా… ఇందులో నాకు బాగా నచ్చిన అంశాల్లో హీరోయిన్‌గా పరిచయమైన “నిధి ప్రదీప్” గురించి తప్పక చెప్పాలి. ఈ అమ్మాయికి మంచి భవిష్యత్ ఉంది. తన పాత్రలోని పార్శ్వాలను చక్కగా ఆవిష్కరించింది. ముఖ్యంగా తెలుగమ్మాయి కాకపోయినా కూడా ఆమెలో తెలుగుదనం కొట్టొచ్చినట్టుగా కనిపించింది!!

అలాగే హీరో మరదలిగా నటించిన “రీనూ” గోదారి తాలూకు అమాయకత్వాన్ని, వాగుడుగాయితనాన్ని చాలా సహజంగా ప్రదర్శించింది. నో డౌట్… ఈ అమ్మాయికి కూడా మంచి ఫ్యూచర్ ఉంది!!

లైలా రీ-ఎంట్రీకి ఇది సరైన పాత్ర కాకపోయినా, ఆమె తెరపై కనిపించినప్పుడల్లా ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది. అయితే “జగపతి బాబు – లైలా” (భార్యాభర్తలు), అలాగే “లైలా – నిధి ప్రదీప్” (తల్లి కూతుళ్లు) కనిపించే ట్రాక్‌లలో మరింత బలమైన సన్నివేశాలు రాసుకునే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదనిపిస్తుంది!!

గత కొన్ని సంవత్సరాలుగా జగపతి బాబును విలన్ పాత్రల్లో చూసి చూసి “కళ్ళు మొత్తిన” ప్రేక్షకులకు, ఓ సాధారణ దిగువ తరగతి తండ్రి పాత్రలో ఆయన్ను చూడటం హాయిగా అనిపిస్తుంది. తమ బిజీ షెడ్యూల్స్ వల్ల… ఈ చిత్రం ప్రి-రిలీజ్ ఈవెంట్ కి హాజరు కాలేకపోయిన రాజీవ్ కనకాల, దేవీప్రసాద్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు!!

ఇకపోతే… వందకు పైగా షార్ట్ ఫిలిమ్స్ తీసిన అనుభవం కలిగి… ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన “సుభాష్ చంద్ర”కు “రెండో సినిమా ఛాన్స్” అయితే కచ్చితంగా వస్తుంది. కానీ తనకు లభించిన “గోల్డెన్ ఛాన్స్‌”ను మాత్రం ఈ కుర్రాడు “జస్ట్ సిల్వర్ ఛాన్స్” చేసుకున్నాడేమోననిపించింది నాకు!!

కాకపోతే…ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయమైన “అభినవ్ రావు”ను మాత్రం తప్పక అభినందించాలి. నిర్మాణ రంగంలోకి ప్రవేశించే ముందు… సినిమా రూపకల్పనకు సంబంధించిన ప్రత్యేక కోర్సు చేశాడని తెలుసుకున్నాక ఈ యువ నిర్మాతపై నాకు మరింత సదభిప్రాయం కలిగింది. “రెడ్ పప్పెట్స్” బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రంతో అతను తన “ఇంటర్న్‌షిప్” విజయవంతంగా పూర్తి చేసుకున్నట్టే. మంచి అభిరుచి కలిగిన అభినవ్ రావు నుంచి భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు కచ్చితంగా ఎక్సపెక్ట్ చేయొచ్చు. “రెడ్ పప్పెట్” అనే బ్యానర్ తో ప్రొడ్యూసర్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ ప్రొడ్యూసర్ కి టాలీవుడ్ కచ్చితంగా “రెడ్ కార్పెట్” పరుస్తుంది!!

“మేమ్ ఫేమస్” సినిమాతో యమా ఫేమస్ అయిన సుమంత్ ప్రభాస్, ఆటో డ్రైవర్ రాజు పాత్రకు పూర్తి న్యాయం చేసేందుకు తనవంతు ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా గోదావరి యాస కోసం అతను చాలా ప్రయాస పడ్డాడనిపిస్తుంది!!

జగపతి బాబు పాత్రకు ఓ రేంజ్‌లో ఎలివేషన్, బిల్డప్ ఇచ్చిన దర్శకుడు, దాన్ని నిలబెట్టడంలో మాత్రం పూర్తిగా తడబడ్డాడు. ఒక పిల్ల బచ్చాగాడి చేతిలో ఆ పాత్ర చావుదెబ్బలు తింటుంటే హీరో వచ్చి రక్షించే సీన్ చూసినప్పుడు, అప్పటివరకు ఇచ్చిన ఎలివేషన్ మొత్తం ఒక్కసారిగా కిల్ అయిన ఫీలింగ్ కలుగుతుంది!!

అలాగే తనకు తారసపడిన ప్రతి అమ్మాయిని ఫటాఫట్ ప్రేమించేస్తుండే నెల్లూరు సుదర్షన్ పాత్రను కూడా దర్శకుడు సరిగ్గా డిజైన్ చేయలేదనిపిస్తుంది. హీరో ప్రేమించిన అమ్మాయితోనూ టక్కున ప్రేమలో పడిపోయి, “స్నేహం కోసం నా ప్రేమ త్యాగం చేశా” అంటూ చివరివరకు కామెడీగా చెప్పుకునే సుదర్శన్ పాత్ర… చివరికి హీరో చెల్లెలిపైనా మనసు పారేసుకోవడం, పెళ్లి చేసుకోవాలనుకోవడం చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.
అలాగే ప్రేమ విషయంలో హీరోయిన్ చూపించే కన్ఫ్యూజన్ విషయంలోనూ దర్శకుడు మరికొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదనిపిస్తుంది. ముఖ్యంగా “గోదావరి గట్టుపైన” అనే టైటిల్ పెట్టినా, సినిమాలో గోదారి తాలూకు ఆత్మను ఆవిష్కరించడంలో దర్శకుడు అంతగా సక్సెస్ కాలేదనిపిస్తుంది!!

అయితే… “రంధ్రాన్వేషణ” చేస్తూ… సినిమాలు చూసే నాలాంటి వాళ్లను పక్కనపెడితే, సినిమా ప్రేమికులంతా ఒకసారి హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయదగ్గ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “గోదావరి గట్టుపైన”

దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే… నాకు పార్టులు.. పార్టులుగా నచ్చిన ఈ సినిమా, మా ఆవిడికి మాత్రం తెగ నచ్చేయడం!!

ఈ సినిమాకి నేనిచ్చే
రేటింగ్: 70/100 ⭐

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments