హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ రెండో హాల్‌లో నిర్వహించిన ఏకాగ్ర ఇంటర్నేషనల్ ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్ బహుమతి ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ఈ టోర్నమెంట్ పోటీలలో విజేత లుగా నిలిచిన చెన్నై కి చెందిన ఇనియన్ కు 5 లక్షల ప్రైజ్ మనీ తో మొదటి బహుమతి లభించింది. రెండవ బహుమతిగా మిత్రోబా గుహ కు 3 లక్షల రూపాయలు, మూడవ బహుమతిగా హరికృష్ణ కు లక్ష రూపాయలు అందజేశారు. వివిధ క్యాటగిరిలు, ర్యాంకింగ్ ల ప్రకారం మిగతా మొత్తం అంటే 13 లక్షల 22 వేల 222 రూపాయలను విజేతలకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరైన ఆనయ ఆమెయా తల్లి, టోర్నమెంట్ చైర్మన్, పనషా అగర్వాల్ తండ్రి వరుణ్ అగర్వాల్ లు మాట్లాడుతూ
పిల్లల్లో ఏకాగ్రత, మేధాశక్తి పెంపొందించడంలో, చెస్ ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ క్రీడలో రాణించాలంటే కష్టపడి సాధన చేయాల్సిందేనని, నిరంతర శ్రమే విజయానికి మార్గమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఇలాంటి అంతర్జాతీయ స్థాయి చెస్ టోర్నమెంట్ నిర్వహించడం
ఆనందకరమని కాంగ్రెస్ నేత ఫెరోజ్ ఖాన్ అన్నారు. గెలుపు–ఓటములు ఆటలో సహజమని, గెలిచినా ఓడినా మళ్లీ మళ్లీ ఆడుతూ ముందుకు సాగితే ఒక రోజు తప్పకుండా విజయం సాధిస్తారని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ, పిల్లలలో ఉన్న ఆసక్తిని తల్లిదండ్రులు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
కార్యక్రమం ప్రారంభంలో ఏకాగ్ర అకాడమీలో శిక్షణ పొంది కాండిడేట్ మాస్టర్ టైటిల్ సాధించిన హైదరాబాద్‌కు చెందిన కవలలు అమాయ అగర్వాల్, అనయ్ అగర్వాల్‌లను నిర్వాహకులు ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కవలల ద్వారా తమ అకాడమీ కి ప్రత్యేక గుర్తింపు లభించిందని పేర్కొంటూ వారిని సత్కరించారు.
అకాడమీ ఫౌండర్ డైరెక్టర్ సందీప్ నాయుడు మాట్లాడుతూ తమ సంస్థ త్వరలో అంతర్జాతీయ ఫిడే రేటింగ్ చెస్ పోటీలు నిర్వహిస్తుందని దానికి అందరూ సహకరించాలని కోరారు.
సినీనటుడు జెమినీ సురేష్ మాట్లాడుతూ తెలంగాణలో రూ.22,22,222 భారీ ప్రైజ్ మనీతో ఈ టోర్నమెంట్ నిర్వహించడం ఆనందకరమని ఈ వాతావరణం చూసి తన పిల్లలకు కూడా చెస్ నేర్పించాలి అనే ఆలోచన కలిగిందన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రాండ్‌మాస్టర్లు దీపెన్, సేతురామెన్, అంతర్జాతీయ మాస్టర్లు, కోచ్‌లు, ఏకగ్రా డైరెక్టర్లు చైతన్య నాయుడు, గిరీష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

