తణుకు, డిసెంబర్ 4, 2025 : తెలుగువారి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహా గాయకుడు “గాన గంధర్వుడు”, పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు అని రాష్ట్ర చేనేత కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ శ్రీమతి వావిలాల సరళాదేవి అన్నారు.
ఘంటసాల వెంకటేశ్వరరావు 103 వ జయంతి సందర్భంగా స్థానిక ఎన్.టి.ఆర్. మున్సిపల్ పార్కు వద్ద 2018వ సంవత్సరంలో వావిలాల రమేష్, శ్రీమతి వావిలాల సరళాదేవి దంపతులు ఏర్పాటు చేసిన “పద్మశ్రీ” ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహం వద్ద గురువారం ఉదయం జరిగిన జయంతి సమావేశానికి శ్రీమతి వావిలాల సరళాదేవి అధ్యక్షత వహించి ప్రసంగించారు. ఘంటసాల వెంకటేశ్వరరావు నూట పదకొండు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి, అనేక వేల పాటలు, అనేక భాషల్లో పాడి సంగీత ప్రియులను అలరించారని శ్రీమతి వావిలాల సరళాదేవి వివరించారు.
తొలుత “పద్మశ్రీ” ఘంటసాల విగ్రహానికి వావిలాల పవన్ కుమార్, ఘంటసాల అభిమానులు పుష్ప మాలలు అలంకరించగా, మరి కొంత మంది ఘంటసాల అభిమానులు పుష్పాలతో పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా స్థానిక ఇంపల్స్ జూనియర్ కళాశాల విద్యార్థినులు, శ్రీమతి వావిలాల సరళాదేవి, శ్రీమతి పప్పొప్పు విజయలక్ష్మి, కోట రామ ప్రసాద్, అర్జి భాస్కరరావు, ఎస్.దొరబాబు, కె. వినోద్ కుమార్ ప్రభృతులు ఘంటసాల పాటలతో అలరించారు. ప్రముఖ నాటక నటులు షణ్ముఖి ఆంజనేయరాజు కుమారులు, ప్రముఖ నాటక నటులు విజయ షణ్ముఖి ఘంటసాల వెంకటేశ్వరరావు పై పద్యాన్ని హృద్యంగా ఆలపించి అలరించారు.
ఈ కార్యక్రమంలో తెలుగు దేశం నాయకులు తాతపూడి మారుతీరావు, రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకులు, టీవీ మరియు సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోట రామ ప్రసాద్, రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ ఆకెళ్ళ సుబ్రహ్మణ్యం, సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ కోశాధికారి అర్జి భాస్కరరావు, తణుకు లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు చీకటి శ్రీనివాసరావు, సినీ గేయ రచయిత్రి శ్రీమతి పప్పొప్పు విజయలక్ష్మి, ఆర్టిస్ కళాంజలి రమణ, శ్రీమతి మునుకుట్ల ఉమా జ్యోతి , గాయకులు ఎస్.దొరబాబు, యం.శ్రీనివాస్, ఆర్టిస్ట్ నక్కా రామారావు ప్రభృతులు, ఘంటసాల అభిమానులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో తణుకు లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు చీకటి శ్రీనివాసరావు తమ అరవయ్యవ జన్మదినోత్సవం ఘంటసాల జన్మ దిన వేడుకల్లో మిత్రుల మధ్య జరుపుకున్నారు.
ఈ సందర్భంగా వావిలాల రమేష్, శ్రీమతి వావిలాల సరళాదేవి సౌజన్యంతో ఇంపల్స్ జూనియర్ కళాశాల విద్యార్థినులకు పెన్నులు, సమావేశానికి హాజరైన ఘంటసాల అభిమానులకు చాక్లెట్లు పంచి పెట్టారు.

