“బాహుబలి” చిత్రాలతో బాలీవుడ్ లో ప్రభంజనం సృష్టించిన రెబల్ స్టార్ ప్రభాస్… ఆ చిత్రాల తర్వాత వరుసగా మూడు పరాజయాలు అందుకోవడం తెలిసిందే. “సలార్”తో బౌన్స్ బ్యాక్ అయి… “కల్కి”తో మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు ప్రభాస్. అయినా సరే… ప్రభాస్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న “రాజా సాబ్” విడుదలవుతున్న రోజే… రణవీర్ సింగ్ నటిస్తున్న “దురంధర్” చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామని ప్రకటించడం బాలీవుడ్ మీడియా సర్కిల్ లో పెద్ద దుమారమే రేపుతోంది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ నటించిన చిత్రం విడుదలవుతున్న రోజే “దురంధర్” కూడా వస్తుండడం అక్కడ సహజంగానే చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన “కన్నప్ప” చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రత్యేక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు విజయం అందుకున్న ఈ చిత్రం నార్త్ లో కనీస ప్రభావం కూడా చూపించలేకపోయింది. అలాగే ‘కల్కి’ విజయం అమితాబ్ కు మాత్రమే చెందుతుందని పలువురు బాలీవుడ్ ప్రముఖులు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అందువల్లే… ప్రభాస్ సినిమా వస్తున్నప్పటికీ… ఏమాత్రం భయం లేకుండా “దురంధర్” చిత్రాన్ని రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇకపోతే… “రాజాసాబ్ – దురంధర్” రెండు చిత్రాల్లోనూ సంజయ్ దత్ ముఖ్యపాత్ర పోషించడం విశేషం. అక్షయ్ ఖన్నా, మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి అగ్ర తారలు సైతం “దురంధర్”లో ఉన్నారు. ఇంకా నాలుగున్నర నెలల వ్యవధి ఉంది కాబట్టి… “రాజాసాబ్ – దురంధర్”ల మధ్య క్లాష్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారేమో చూడాలి. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే… ప్రస్తుత మన జాతీయ భద్రతా సలహాదారు, ప్రధాని నరేంద్ర మోడీ, హోమ్ మినిష్టర్ అమిత్ షాలకు అత్యంత సన్నిహితుడైన అజిత్ ధోవల్ జీవితంలోని కొన్ని ముఖ్య సంఘటనల స్పూర్తితో “దురంధర్” చిత్రాన్ని తెరకెక్కించి ఉండడం!!
బాలీవుడ్ లో ప్రభాస్ స్టార్ డమ్ పలచబడిందా?..రెబల్ స్టార్ ను ఢీ కొట్టనున్న రణవీర్ సింగ్
