ధర్మం కోసం పోరాడిన యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్న చిత్రం “హరి హర వీరమల్లు”. ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ – క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జూలై 24న విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా గురించి చిత్ర కథానాయకి నిధి అగర్వాల్.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
హరి హర వీరమల్లు”లో నటించే అవకాశం రావడమే గొప్ప విషయం. అలాంటిది నాకు పంచమి అనే శక్తివంతమైన పాత్ర లభించింది. ఈ పాత్రలో ఎన్నో కోణాలున్నాయి. పవన్ కళ్యాణ్ గారికి, నాకు మధ్య సన్నివేశాలు బాగుంటాయి. అలాగే నా పాత్ర కనిపించే పాటల్లో కూడా వైవిధ్యం ఉంటుంది. పంచమి పాత్రకు తగ్గట్టుగా స్టైలిస్ట్ ఐశ్వర్య దుస్తులను, ఆభరణాలను అద్భుతంగా రూపొందించారు.
పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి ఎంతో స్టార్డం ఉంది, ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమా అంటే ఖచ్చితంగా ఎక్కువమంది ప్రేక్షకులకు చేరువ అవుతుంది. వేరే వంద సినిమాలు చేసినా ఒకటే.. పవన్ కళ్యాణ్ గారితో ఒక్క సినిమా చేసినా ఒకటే. పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఆయనకు సాహిత్యం అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా తెలుగు సాహిత్యం ఎక్కువ చదువుతారు. ఆయనకు ఎంతో నాలెడ్జ్ ఉంది!!
