
మల్టిపుల్ భారీ ప్రాజెక్ట్స్ తో
పులిస్వారి చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్
ఒక రోజు షూటింగ్ చేయడం అంటేనే… ఒక పెళ్లి చేయడంగా చెబుతారు. అలాంటిది… ఏకకాలంలో రెండు మూడు సినిమాలు తీయడమంటే…?? అందులోనూ పాన్ ఇండియా సినిమాలు తీయడమంటే…?? ఇక వాటిని ఒకేరోజు విడుదల చేయడం అంటే…?? అందుకే అంటున్నారు… మల్టిపుల్ భారీ ప్రాజెక్ట్స్ తో మైత్రి మూవీ మేకర్స్ వారు పులిస్వారి చేస్తున్నారని. అజిత్ నటించిన “గుడ్ బ్యాడ్ అగ్లీ”, సన్నీ డియోల్ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన “జాట్”… ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. పబ్లిసిటీ కూడా కలిపితే… రెండు ప్రాజెక్టులకు తక్కువలో తక్కువ 400 కోట్ల బడ్జెట్ ఉంటుంది. మార్కెట్ పరంగా ఒకదానితో ఒకటి పోటీ పడే అవకాశం లేనప్పటికీ… రెండు భారీ చిత్రాలు ఒకే నిర్మాణ సంస్థ నుంచి ఒకే రోజు విడుదలవుతుండడం కచ్చితంగా చర్చనీయాంశమే. రామ్ చరణ్ “పెద్ది”, ఎన్ఠీఆర్ – ప్రశాంత్ నీల్ చిత్రం, మళ్లీ రామ్ చరణ్ తోనే సుకుమార్ చిత్రం, ఆ తర్వాత “పుష్ప-3″తోపాటు మరికొన్ని భారీ బడ్జెట్ చిత్రాలు మైత్రి నుంచి రానున్నాయి. వీటన్నిటికీ 2 వేల కోట్లకు పైగానే బడ్జెట్ ఉంటుంది. నాలుగైదు సినిమాలకు వచ్చే ప్రాఫిట్… ఒక సినిమాతో పోయేంత రిస్క్ కలిగిన చిత్రసీమలో… ఇన్ని మెగా ప్రాజెక్ట్స్ మైత్రి ఎలా హ్యాండిల్ చేస్తోందన్నది అందర్నీ తొలిచేస్తున్న బిలియన్ డాలర్ ప్రశ్న!!
