నటనకు పెట్టని కోట నేల కొరిగింది”… “మరో నట శిఖరం కూలిపోయింది” వంటి శీర్షికలతో కోట శ్రీనివాసరావు కాలం చేసిన వార్తలు చదివిన/విన్న నేటి తరం పిల్లలు కొంచెం ఆశ్చర్యపోయి ఉండొచ్చు. కానీ… వాటిలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదని ముందు ముందు వారంతా తెలుసుకుంటారు. ఎస్.వి.రంగారావు, కైకాల సత్యనారాయణ వంటి మహా నటుల వారసత్వాన్ని పుణుకిపుచ్చుకున్న కోట, ఒక దశలో వారిని మరిపించేంత మహా నటనను ప్రదర్శించారు. చిల్లర వేషాలతో వెకిలి హాస్యం పలికించి ఉండడం వల్ల… ఆయన్ను కూడా ఓ మహా నటుడుగా అభివర్ణిస్తే… కొంతమందికి ఇబ్బందిగా ఉండొచ్చునేమోగానీ… నటనలో కోట శ్రీనివాసరావు ప్రదర్శించిన వైవిధ్యాన్ని నిశితంగా పరిశీలించినవారు మాత్రం పూర్తిగా ఏకీభవిస్తారు. ఆ పిలుపును మనసారా ఆహ్వానిస్తారు. “హాస్యం, రౌద్రం, కరుణ, కామం” వంటి నవరసాలు అలవోకగా కురిపించడం ఆయనకు మాత్రమే చెల్లు. కోట శ్రీనివాసరావుకు వారసులు లేకపోవడం వలన… భవిష్యత్తులో ఆయన గురించి గొప్పగా మాట్లాడేవాళ్ళు, కనీసం గుర్తు చేసుకునేవాళ్ళు ఎవరూ ఉండకపోవచ్చు. నటనకు పాఠ్యపుస్తకం లాంటి కోటపై కనీసం ఒక పుస్తకం వెలువరించడమో, ఆయన నట విశ్వరూపాన్ని ఆవిష్కరించేలా ఒక డాక్యుమెంటరీ తీసుకురావడంమో చేయాల్సిన బాధ్యత పరిశ్రమ పెద్దలు తీసుకోవాలి. నటనలో రాణించాలనుకునే ప్రతి ఒక్కరికీ పెద్దబాలశిక్ష లాంటి కోట శ్రీనివాసరావుకు “స్వాతిముత్యం” ఘన నివాళులు అర్పిస్తోంది!!
అప్పాజీ
