గీతూ మోహన్‌దాస్ ప్రయాణంలో ‘టాక్సిక్’ ఒక కీలక మలుపు
సినిమా అంటే కేవలం నటించడం మాత్రమే కాదు… ఒక కథను చూడటం, దాన్ని అర్థం చేసుకోవడం, ఆ తర్వాత తనదైన దృష్టితో తెరపై ఆవిష్కరించడం కూడా. ఈ ప్రయాణంలో నటిగా మొదలై దర్శకురాలిగా తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసిన అరుదైన ప్రతిభావంతుల్లో గీతూ మోహన్‌దాస్ ఒకరు.
మరో 24 గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’తో ఆమె ఇప్పుడు భారతీయ సినీ ప్రేక్షకుల దృష్టిని మరింతగా ఆకర్షిస్తున్నారు. యష్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ భారీ చిత్రానికి గీతూ దర్శకత్వం వహించారు. ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ఆమె కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్.

బాలనటిగా మొదలైన ప్రయాణం
గీతూ మోహన్‌దాస్‌కు కెమెరా కొత్తది కాదు. బాలనటిగా చిన్న వయసులోనే సినిమాల్లోకి ప్రవేశించిన ఆమె, అనంతరం కథానాయికగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘అకలే’, ‘ఒరిడమ్’ వంటి చిత్రాల్లో నటనకు ప్రశంసలు అందుకుంది.
అయితే ఒక దశలో ఆమెకు నటనకంటే కథ చెప్పాలనే తపన ఎక్కువైంది.
అదే ఆమె జీవితంలో కీలకమైన మలుపు.
2009లో ‘అన్‌ప్లగ్డ్’ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించిన గీతూ, దర్శకత్వం వైపు అడుగులు వేసింది. ఆమె రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ‘Are You Listening?’ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకోవడం ఆమె కొత్త ప్రయాణానికి బలమైన పునాది వేసింది.
ఆ తర్వాత వచ్చిన ‘Liar’s Dice’ ఆమెను కేవలం ఒక నటిగా కాకుండా, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన దర్శకురాలిగా నిలబెట్టింది. ఈ చిత్రం సన్‌డాన్స్‌లో పోటీ విభాగానికి ఎంపిక కావడంతోపాటు పలు అంతర్జాతీయ అవార్డులు, రెండు జాతీయ అవార్డులు అందుకుంది. భారతదేశం తరఫున ఆస్కార్ బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ విభాగానికి కూడా అధికారిక ఎంట్రీగా వెళ్లింది.
‘మూతోన్’తో మరింత బలమైన ముద్ర
గీతూ తదుపరి చిత్రం ‘మూతోన్’. కథ, పాత్రలు, వాస్తవికత, భావోద్వేగాలను తనదైన శైలిలో మేళవించిన ఈ సినిమా ద్వారా ఆమె దర్శకురాలిగా తన ప్రత్యేకతను మరింత స్పష్టంగా చాటుకుంది.
అంటే… ఒకప్పుడు తెరపై పాత్రలను పోషించిన గీతూ, ఆ తర్వాత పాత్రలను సృష్టించే స్థాయికి ఎదిగారు.
అక్కడి నుంచి ‘టాక్సిక్’ వరకు…
ఇదే ప్రయాణం ఇప్పుడు ఒక భారీ మలుపు తీసుకుంది.
యష్ వంటి పాన్-ఇండియా స్టార్‌ను కథానాయకుడిగా పెట్టుకుని, భారీ స్థాయిలో తెరకెక్కిన ‘టాక్సిక్’ను గీతూ మోహన్‌దాస్ రూపొందించారు. 1940ల నుంచి 1970ల మధ్యకాలపు గోవా నేపథ్యంలోని గ్యాంగ్‌స్టర్ ప్రపంచం, అధికారం, ద్రోహం, హింస వంటి అంశాలతో ఈ చిత్రం రూపొందింది.
‘కేజీఎఫ్’ తర్వాత యష్‌కు వచ్చిన స్టార్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుంటే, భారీ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కించడానికి ఇప్పటికే కమర్షియల్ విజయాలు సాధించిన దర్శకులెందరో అందుబాటులో ఉన్నారు. కానీ యష్ మాత్రం గీతూ మోహన్‌దాస్‌ను ఎంచుకున్నారు.
ఇటీవల యష్ స్వయంగా కూడా గీతూతో పనిచేయాలన్న తన నిర్ణయాన్ని సమర్థిస్తూ, ఆమెపై తనకు ఉన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
అంతేకాదు… నయనతార కూడా తొలుత ‘టాక్సిక్’ విషయంలో సందేహించినప్పటికీ, గీతూ చెప్పిన పూర్తి కథనం విన్న తర్వాత తన అభిప్రాయం మార్చుకుని సినిమాలో భాగమయ్యానని చెప్పడం విశేషం.
అసలు పరీక్ష ఇదే!
ఇప్పటివరకు గీతూ మోహన్‌దాస్ తన సినిమాలతో విమర్శకుల ప్రశంసలు, అంతర్జాతీయ గుర్తింపు సంపాదించారు.
కానీ ‘టాక్సిక్’ మాత్రం మరో స్థాయి పరీక్ష.
ఎందుకంటే ఇది కేవలం దర్శకురాలి సినిమా కాదు… యష్ అభిమానుల భారీ అంచనాల మధ్య వస్తున్న సినిమా. పైగా ప్రచార చిత్రాలపై ఇప్పటికే చర్చ, ఆసక్తి, విమర్శలు అన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. యష్ మాత్రం పూర్తి సినిమా చూసిన తర్వాతే గీతూ ప్రతిభ, సినిమాలోని మహిళా పాత్రల ప్రాధాన్యం స్పష్టమవుతుందని చెబుతున్నారు.
అందుకే ‘టాక్సిక్’ ఫలితం గీతూ మోహన్‌దాస్‌కు అత్యంత కీలకం.
ఒక బాలనటిగా కెమెరా ముందుకు వచ్చిన అమ్మాయి…
హీరోయిన్‌గా గుర్తింపు పొందింది.
ఆ తర్వాత కెమెరా వెనక్కి వెళ్లింది.
చిన్న కథలతో తన గొంతును వినిపించింది.
అంతర్జాతీయ అవార్డులు అందుకుంది.
ప్రపంచస్థాయి ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో మెరిసింది
ఇప్పుడు వేలాది స్క్రీన్లపై ఒక భారీ స్టార్‌తో తన కథను చెప్పబోతోంది.
ఇదే గీతూ మోహన్‌దాస్ ప్రయాణం. ఇంకో 24 గంటల్లో ప్రేక్షకులు ‘టాక్సిక్’ను చూడబోతున్నారు.
ఆ సినిమా విజయం యష్ స్టార్‌డమ్‌కు ఎంత ముఖ్యమో…
గీతూ మోహన్‌దాస్ దర్శక ప్రయాణంలో మరో కొత్త అధ్యాయానికి అంతకంటే ఎక్కువ ముఖ్యమైనది.
ఎందుకంటే…
హీరోయిన్‌గా తెరపై కనిపించిన గీతూ…
దర్శకురాలిగా తన ప్రపంచాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొస్తున్నారు.
