‘అగధ’ కోసం బుద్ధిజం పుస్తకాల్ని చదివాను. బ్లాక్ మ్యాజిక్ గురించి తెలుసుకున్నాను – కామాక్షి భాస్కర్ల
శ్యాం ప్రసాద్ రెడ్డి గారి లాంటి పెద్ద నిర్మాత నన్ను అనుష్కతో పోల్చడం ఆనందంగా అనిపించింది – కామాక్షి భాస్కర్ల
కామాక్షి భాస్కర్ల ఎంచుకునే సినిమాలు, కథలు, సాధిస్తున్న విజయాల గురించి అందరికీ తెలిసిందే. కంటెంట్ ఓరియెంట్ ప్రాజెక్ట్‌లని చేస్తూ దూసుకుపోతోన్న కామాక్షి భాస్కర్ల రేపు (ఆగస్ట్ 14) ‘అగధ’ అంటూ రాబోతోన్నారు. ఈ సినిమాని శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మాణంలో ఎం.ఎస్. రాజు తెరకెక్కించారు. ఈ మూవీలో కామాక్షి భాస్కర్లతో పాటు శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భాను చందర్, షిజు, వనిత విజయ్‌కుమార్, రోషన్ బషీర్, శ్రేయా రాణి రెడ్డి, వివా రాఘవ, రాబర్ట్ మాస్టర్, ఆర్నా ములేర్, కనకవ్వ ముఖ్య పాత్రలను పోషించారు. శుక్రవారం సినిమా విడుదల అవుతున్న సందర్భంగా కామాక్షి భాస్కర్ల మీడియాతో ముచ్చటించారు. ఆమె చెప్పిన విశేషాలేంటో ఓ సారి చూద్దాం.
శ్యాం ప్రసాద్ రెడ్డి గారు మిమ్మల్ని అనుష్కతో పోల్చారు? దానిపై మీ స్పందన ఏంటి?
అంత పెద్ద నిర్మాత నన్ను అలా పోల్చడం ఆనందంగా అనిపించింది. ఆయన అనుష్క గారితో పోల్చడం అనేది నన్ను మరింత బాధ్యతగా ఉండేలా చేస్తుంది (నవ్వుతూ).
‘అగధ’లోని వస్త్రాధారణ గురించి చెప్పండి?
‘అగధ’లో ప్రతీది కూడా రాజు విజన్ అని చెప్పుకోవచ్చు. ప్రతీది డిఫరెంట్‌గా ఉండాలని ముందే ఆయన అనుకున్నారు. అలాంటి చీరకట్టులో నాకు కాస్త ఇబ్బంది అనిపించింది.
‘అగధ’లోని యాక్షన్ సీక్వెన్స్ గురించి చెప్పండి?
‘అగధ’లోని యాక్షన్ సీక్వెన్స్ కోసం మేం ముందుగానే వర్క్ షాప్స్ చేశాం. రిహార్సల్స్ చేశాం. అయితే సెట్లో చిన్న చిన్న ఇబ్బందులు సహజం. కానీ టీం అంతా కలిసి శ్రమించడం వల్ల అవుట్ పుట్ బాగా వచ్చింది.
‘అగధ’ జర్నీలో మీరు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి?
మహాదేవి పాత్ర కోసం మారేందుకు నాకు టైం పట్టింది. కామాక్షిగా నన్ను నేను పక్కనపెట్టి, నా ప్రిన్సిపల్స్ పక్కన పెట్టి ఆ పాత్ర కోసం మారడానికి ఇబ్బంది అనిపించింది. దేవుడి అనుగ్రహంతో పుట్టే పాత్ర అది. బుద్ధిజం పుస్తకాల్ని చదివాను. బ్లాక్ మ్యాజిక్ గురించి తెలుసుకున్నాను. ప్రతీ ముద్ర గురించి, ఆ పాత్ర నడవడిక గురించి అర్థం చేసుకుని నటించాను. సినిమాలో ఎక్కడా కూడా కామాక్షి కనిపించకూడదని జాగ్రత్తలు తీసుకున్నాను.
ఎం.ఎస్. రాజు గారి నుంచి ఫోన్ రావడం ఎలా అనిపించింది?
నాకు ఎం.ఎస్. రాజు గారి సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆయన తీసిన వాటిల్లో ‘మనసంతా నువ్వే’ నాకు ఆల్ టైం ఫేవరేట్. ఆయన ‘అగధ’ కోసం ఫోన్ చేయడంతో చాలా సంతోషంగా అనిపించింది. నా ‘పొలిమేర’ చూశానని ఆయన అన్నారు. ఆయన ప్రతీ సినిమాలోని ప్రతీ ఆర్టిస్ట్ పవర్ ఫుల్‌గానే కనిపిస్తారు.
ఫీమేల్ సెంట్రిక్ సినిమాల గురించి చెబుతూ మీ 9 ఏళ్ల జర్నీని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు కదా? ఎందుకు అంత ఎమోషనల్ అయ్యారు?
మేల్ చేసినప్పుడు మేల్ సెంట్రిక్ సినిమాలు అనరు. కానీ ఫీమేల్ చేస్తే మాత్రం ఫీమేల్ సెంట్రిక్ సినిమా అంటారు. ఇంట్లో మహిళలు మల్టీపుల్ టాస్కులు చేస్తుంటారు. స్క్రీన్ మీద ఫీమేల్ కారెక్టర్స్ ఇండిపెండెంట్‌గా ఎందుకు ఉండకూడదు అని అనుకునేదాన్ని. 2019 నుంచి సరైన అవకాశం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాను. చిన్న చిన్న పాత్రల కోసం ఎన్నో ఆడిషన్స్ ఇచ్చాను. నేను సినిమాల కోసం ఎంతో కష్టపడ్డాను. ఇప్పటికీ నాకు కారు లేదు. బైక్ మీదే వస్తాను. ఇప్పుడు అందరూ రోడ్ల మీద గుర్తు పట్టి నన్ను ఫాలో అవుతున్నారు (నవ్వుతూ). ప్రొడక్షన్ వాళ్లు ఇచ్చే వెహికల్ కూడా నాకు కొత్తగా అనిపిస్తుంది. మాది మిడిల్ క్లాస్ కావడంతో మాకు కారు పెద్ద విషయం (నవ్వుతూ).
ఈ జర్నీలో మీకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పండి?
సత్యం రాజేష్ పక్కన చేసిందా? అయితే వద్దు అని నా ముందే చాలా మంది అన్నారు. ఎవరి పక్కన చేస్తున్నామో కూడా ఇక్కడ చూస్తున్నారు. అది చాలా తప్పు.
‘పొలిమేర’, ‘అగధ’ వంటి చిత్రాలు మీకు వస్తుండటం ప్లస్ పాయింట్ అనుకుంటున్నారా? మైనస్ అనుకుంటున్నారా?
జానర్స్ రిపీట్ అవుతున్నా పాత్రలు మాత్రం కొత్తగానే ఉంటున్నాయి. ఓ సినిమాని కామాక్షి భుజానికి ఎత్తుకుని ముందుకు తీసుకు వెళ్లగలదు అనే నమ్మకాన్ని ఏర్పర్చాలి. కొన్ని సినిమాల్ని డబ్బుల కోసం చేస్తాం. ఇంకొన్ని మనల్ని మనం సంతృప్తి పర్చుకునేందుకు చేస్తుంటాం. చిన్న అవకాశం, పెద్ద అవకాశం అని నేను చూడను. వచ్చిన అవకాశాల్లో నాకు నచ్చిన పాత్రను ఎంచుకుంటాను. నెక్ట్స్ నేను ఓ లవ్ స్టోరీకి సైన్ చేశాను. ‘పొలిమేర’, ‘అగధ’ వంటి చిత్రాలకే సూట్ అవుతాను అని అనుకునే విషయాన్ని నేను బ్రేక్ చేస్తాను.
గ్లామర్ పాత్రలను ఎందుకు ఎంచుకోవడం లేదు?
ఎప్పుడూ ఒకే రకమైన పాత్రలు చేయడం నాకు నచ్చదు. పైగా మన ఇంట్లోని మహిళలను రిప్రజెంట్ చేసే కారెక్టర్స్ని పోషించాలని అనుకుంటున్నాను. మన ఇంట్లో వాళ్లు నన్ను తెరపై చూస్తే.. అరె నాలానే ఉందే అని అనిపించాలి. ఓ తెలుగమ్మాయిగా.. మన తెలుగు అమ్మాయిలా పాత్రల్ని తెరపై నేను రిప్రజెంట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు. అందుకే నాకు గ్లామర్, క్వీన్ వంటి పాత్రల కన్నా.. సాధారణ మహిళా పాత్రలే ఇష్టం.
‘అగధ’ను అంగీకరించడానికి మీకు నచ్చిన అంశాలు ఏంటి?
రాజు గారు నన్ను పిలిచారంటే కచ్చితంగా ఏదో ఒక కొత్త పాయింట్, ముఖ్యమైన పాత్రే అయి ఉంటుందని అర్థమైంది. పైగా రాజు గారు కావడంతో నేను కూడా వెంటనే ఓకే చెప్పాను. ‘అగధ’ కథ, నా పాత్ర చెప్పిన తర్వాత మరింతగా నచ్చేసింది. నేను ఎప్పుడూ కూడా జయాపజయాల గురించి పట్టించుకోను. ప్రాసెస్‌ను ఎంజాయ్ చేస్తారు. రాజు గారితో వర్క్ ఎక్స్‌పీరియెన్స్ వస్తుందని కూడా ఈ మూవీకి ఓకే చెప్పాను.
‘అగధ’లోని హారర్, థ్రిల్లింగ్ మూమెంట్స్ గురించి చెప్పండి?
‘అగధ’లో మరీ ఎక్కువ హారర్ మూమెంట్స్ ఉండవు. చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. డివైన్ మూమెంట్స్ చాలా ఉంటాయి. చివరికు అందరికీ ఓ డివైన్ ఫీలింగ్ వస్తుంది.
ఇతర ఆర్టిస్టుల గురించి చెప్పండి?
మా సెట్లో అందరూ అద్భుతమైన ఆర్టిస్టులే. అందరికీ చాలా అనుభవం ఉంది. భాను చందర్ గారు, షిజు గారు ఇలా అందరితో నటించడం ఆనందంగా అనిపించింది. సెట్లో రోజూ ఓ కొత్త విషయాన్ని నేర్చుకున్నాను.
టెక్నికల్ టీం గురించి చెప్పండి?
నాని చమిడిశెట్టి గారి కెమెరా వర్క్ అద్భుతంగా వచ్చింది. నాని చమిడిశెట్టి గారు ఈ మూవీలో ఎన్నో ప్రయోగాలు చేశారు. రాజు గారి విజన్‌కి ఆయన ప్రాణం పోశారు. డీఐ అద్భుతంగా అనిపించింది. రాజీవ్ గారి ఆర్ట్ వర్క్, ఆయన వేసిన సెట్స్, అమ్మవారి విగ్రహం తెరపై మ్యాజిక్‌గా అనిపిస్తాయి. ఆర్ఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కొన్ని సీన్స్ అయితే ఆర్ఆర్తో నెక్ట్స్ లెవెల్‌కి వెళ్లాయి.
డాక్టర్ వృత్తిని పక్కన పెట్టారా?
అవునండి.. కాస్త గ్యాప్ ఇచ్చాను. నేను అక్కడ ఉండే కంటే ఇక్కడే ఇండస్ట్రీలో ఉండాలని అనుకుంటున్నాను. నాలాంటి సాధారణ మహిళల్ని రిప్రజెంట్ చేయాలని, తెరపై వారందరినీ చూపించాలని అనుకుంటున్నాను.
మున్ముందు దర్శకత్వం వహించే అవకాశం ఉందా?
ఇంత వరకు నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా, అసోసియేట్ డైరెక్టర్‌గా, రైటింగ్ టీంలోనూ పని చేశాను. నాకు దర్శకత్వం వహించాలనే ఆలోచన కూడా ఉంది. కానీ ఇప్పుడు కాదు. దానికి ఇంకా చాలా టైం పడుతుంది.
‘అగధ’ విజయంపై మీకున్న నమ్మకం గురించి చెప్పండి?
‘అగధ’ తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. రాజు గారి కోసమైనా, ఆయన కంబ్యాక్ కోసమైనా కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను ఆల్రెడీ సినిమాను చూశాను. చాలా సీన్లకు లో నేను సర్ ప్రైజ్ అయ్యాను. సెట్లో నార్మల్‌గా అనిపించిన సీన్.. స్క్రీన్ మీద అద్భుతంగా అనిపించింది. మూవీ చూసి చాలా వరకు కన్నీళ్లు పెట్టుకున్నాను. నాకు మాత్రం సినిమా చూసిన తర్వాత ఎంతో ఆనందంగా అనిపించింది.

