భారతదేశం ప్రపంచానికి అందించిన అత్యంత గొప్ప సాంస్కృతిక వారసత్వాల్లో రామాయణం ఒకటి. తరతరాలుగా ఇది కేవలం ఒక ఇతిహాసంగా మాత్రమే కాకుండా, భారతీయుల పండుగలు, విలువలు, జీవన విధానం, సంస్కృతిలో విడదీయరాని భాగంగా కొనసాగుతోంది. భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సమాజంలోనూ రామాయణం తన ప్రభావాన్ని నిలబెట్టుకుంది.
ఇప్పుడు ఆ శాశ్వత గాథ మరో కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతోంది.
జూలై 24న ప్రపంచవ్యాప్తంగా ట్రైలర్ విడుదలకు ముందు, నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ‘రామాయణ’ చిత్ర బృందం న్యూఢిల్లీలో ప్రత్యేకంగా తొలి ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘ప్రథమ్ సంకల్ప్’ పేరుతో నిర్వహించిన ఈ వేడుక, ‘భారత్ నుంచి ప్రపంచానికి రామాయణ ప్రయాణానికి’ శ్రీకారంగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా, జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న అధికారిక ట్రైలర్ను ఎంపిక చేసిన అతిథులకు ప్రత్యేకంగా ప్రదర్శించారు.
‘ప్రథమ్ సంకల్ప్’ కార్యక్రమం మరో ప్రత్యేకతను కూడా సంతరించుకుంది. ‘రామాయణ’ చిత్రంలోని ప్రధాన తారాగణం తొలిసారిగా ఒకే వేదికపై సందడి చేసింది. భారతీయ సినీ పరిశ్రమకు చెందిన పలువురు తరాల కళాకారులను, భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ఒకే వేదికపై కలిపిన ఈ వేడుక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది.

