ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్‌లపై డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం “ఆర్ కే దీక్ష”. డి.ఎస్. రెడ్డి సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో ఢీ, జోడి ఫేమ్ అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్లుగా నటించగా, కిరణ్ హీరోగా కనిపించనున్నారు. తులసి, అనూష, కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూలై 3న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
దర్శక నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – నేను నిర్మాతగా 44 చిత్రాలు చేశాను, దర్శకుడిగా 9 చిత్రాలు రూపొందించాను. “ఆర్ కే దీక్ష” సినిమాకు ఆంధ్ర, సీడెడ్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయ్యింది. నైజాంలోనే థియేటర్స్ ఇవ్వడం లేదు. ఇండస్ట్రీలోని ఆ నలుగురు థియేటర్స్ ను గుప్పిట్లో పెట్టుకుని చిన్న సినిమాను చంపేస్తున్నారు. మా సినిమాకు థియేటర్స్ ఇవ్వకుంటే పోరాటం మొదలు పెడతాం. సోమవారం నుంచి ఫిలింఛాంబర్ ముందు టెంట్ వేసి నిరాహార దీక్ష చేపడతాం. క్యూబ్ యూఎఫ్ఓ లతో దోపిడీ చేస్తూ, థియేటర్స్ లోనూ మోనోపలీ చేస్తున్నారు. చిన్న సినిమాల మనుగడ లేకుండా చేస్తున్న ఇలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సినిమా బాగా లేకుంటే థియేటర్స్ నుంచి తీసేయడం వేరు, కానీ అసలు థియేటర్స్ ఇవ్వకుండా ప్రేక్షకులకు చిన్న సినిమా ఎలా చేరువ అవుతుంది? అని అన్నారు.

